కిచెన్‌లో ఉండే 10 రూపాయల వస్తువు.. మీ ప్రాణాలు తీసే యమపాశం కావొచ్చు!

వంట పాత్రలు కడిగే స్క్రబ్బర్‌ను ఎక్కువకాలం మార్చకుండా వాడితే బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి 2–4 వారాలకు ఒకసారి స్క్రబ్బర్‌ను మార్చాలని, దుర్వాసన లేదా చిరిగిన వెంటనే కొత్తది ఉపయోగించాలని సూచిస్తున్నారు.

కిచెన్‌లో ఉండే 10 రూపాయల వస్తువు.. మీ ప్రాణాలు తీసే యమపాశం కావొచ్చు!
Kitchen

Updated on: Jul 16, 2026 | 9:02 PM

వంటగదిలో ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో పాత్రలు కడిగే స్క్రబ్బర్ ఒకటి. అయితే చాలా మంది స్క్రబ్బర్ పాడయ్యే వరకు లేదా పూర్తిగా చిరిగిపోయే వరకు అదే ఉపయోగిస్తుంటారు. కానీ, స్క్రబ్బర్‌ను సమయానికి మార్చకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వేగంగా పెరిగి ఆహారం ద్వారా ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. తేమ ఎక్కువగా ఉండే వంటగది వాతావరణంలో స్క్రబ్బర్ ఎప్పుడూ తడిగానే ఉంటుంది. పాత్రలపై ఉండే ఆహార అవశేషాలు, నూనె, తేమ కలిసి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. దీంతో స్క్రబ్బర్ పరిశుభ్రంగా కనిపించినా, అందులో లక్షల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ని రోజులకు మార్చాలి?

సాధారణంగా ఇంట్లో రోజూ ఉపయోగించే స్క్రబ్బర్‌ను ప్రతి రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి మార్చడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ స్క్రబ్బర్ నుంచి దుర్వాసన రావడం, రంగు మారడం, చిరిగిపోవడం లేదా శుభ్రం చేసినా మురికిగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొత్తది ఉపయోగించాలి. పెద్ద కుటుంబాల్లో లేదా ఎక్కువగా వంట చేసే ఇళ్లలో స్క్రబ్బర్‌ను మరింత త్వరగా మార్చడం ఉత్తమం. పైగా ఇవి పెద్ద ధర కూడా ఉండవు. మహా అయితే రూ.10 నుంచి రూ.20 లోపే ఉంటాయి. నెలవారి సరుకుల్లో వీటిని ఓ ఐదు కొని పెట్టుకుంటే.. వారానికి ఒకటి వాడినా మంచిదే.

ఇది కూడా చదవండి: Viral Video: భారీ వర్షంలో పొదల మాటున ఏదో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా గుండె గుభేల్

స్క్రబ్బర్‌ను ఎక్కువ కాలం మార్చకుండా వాడితే ఈ-కోలి (E.coli), సాల్మొనెల్లా (Salmonella) వంటి హానికర బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి పాత్రల ద్వారా ఆహారంలోకి చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్క్రబ్బర్‌ను ఎక్కువకాలం ఉపయోగించాల్సి వస్తే, ప్రతిరోజూ వాడిన తర్వాత బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.

వారానికి ఒకసారి వేడి నీటిలో లేదా క్రిమిసంహారక ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదలను కొంతవరకు తగ్గించవచ్చు. తడి ప్రదేశంలో ఎప్పుడూ ఉంచకుండా గాలి బాగా తగిలే చోట ఉంచడం కూడా అవసరం. ఆరోగ్యకరమైన వంటగదిని నిర్వహించాలంటే పాత్రలు మాత్రమే కాదు, వాటిని శుభ్రం చేసే స్క్రబ్బర్ పరిశుభ్రతపైనా సమాన శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే కుటుంబ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో స్క్రబ్బర్‌ను నిర్ణీత వ్యవధిలో మార్చడం మంచిదని చెబుతున్నారు.

Follow Us