
యానిమల్ లవర్స్ అందరూ ఎప్పుడూ ఆసక్తిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. గొరిల్లా, సింహం మధ్య యుద్ధంలో ఎవరు గెలుస్తారనే ప్రశ్న తరచుగా చర్చకు వస్తుంది. గొరిల్లా పంచ్ సింహం ఎముకలను కూడా ముక్కలు ముక్కలు చేయగలదని కొందరు వాదిస్తుంటే, సింహాన్ని అడవికి రాజుగా చెప్పడం వెనుక ఉన్న కారణాలు మర్చిపోతున్నారా అని మరికొందరు అంటున్నారు. ఈ కథనంలో ఈ రెండు శక్తివంతమైన జంతువుల విశేషాలు, బలాలు, జీవన విధానాలను లోతుగా విశ్లేషిద్దాం.
అడవికి రాజు సింహం
సింహం క్యాట్ ఫ్యామిలీలో అతిపెద్ద జంతువులలో ఒకటి. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో కనిపించే సింహం గర్జన దాదాపు 5 మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది. దాని గర్జన డీప్‌గా, శక్తివంతంగా ఉంటుంది. సింహం మెడ చుట్టూ ఉండే ఒత్తుగా జుట్టు దాని రాజసానికి ప్రతీక. దాని శారీరక నిర్మాణం అత్యంత చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. పరిగెత్తినప్పుడు శరీరం ముందు వైపుకు వాలుగా ఉండటం వల్ల ఇది చాలా వేగంగా కదలగలదు. సింహం బలం, ప్రమాదకరమైన స్వభావం, చురుకుదనం వల్ల ఇది మనుషులను ఒక్క దెబ్బకే చంపగలదు. ఎలాంటి ఆయుధం లేకుండా సింహంతో తలపడితే, మనిషి.. సెకన్లలో ఆహారంగా మారాల్సిందే. సింహం పంజా ఎంత బలంగా ఉంటుందంటే, ఒక్క దెబ్బతో మనిషి మెడ ఎముకలను విరగ్గొట్టగలదు. ఇక మిగతా జంతువులను కూడా అలవోకగా వేటాడి చంపేస్తుంది.
గొరిల్లా భూమిపై బలమైన జీవి
గొరిల్లా భూమిపై అత్యంత బలమైన జంతువులలో ఒకటి. దీని చేతి దెబ్బ అమితమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది తన పంజాతో ఒక్కటి ఇచ్చిందంటే.. ఎముకలు ముక్కలు ముక్కలైపోతాయి. చాలాసార్లు గొరిల్లాకు, చిరుతపులికి మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. చిరుతపులి దాడి చేసినప్పుడు, గొరిల్లా దాని తల భాగంలో ఎముకలను విరగ్గొట్టి, దాని పట్టును వదిలేలా చేస్తుంది. చిరుతపులి క్యాట్ ఫ్యామిలీకి చెందిన బలమైన, చురుకైన జంతువు అయినప్పటికీ, గొరిల్లా దానిని కొన్ని దెబ్బలకే చంపగలదు. గొరిల్లా జీవితంలో వయస్సు అనేది చాలా ముఖ్యం. ఇది రెండుసార్లు వయోజన దశకు చేరుకుంటుంది. మొదటిసారి 8 నుంచి 9 సంవత్సరాల వయస్సులో, రెండవసారి 13 నుంచి 14 సంవత్సరాల వయస్సులో శరీరంలో మార్పులు వస్తాయి. ఈ వయస్సులో మగ గొరిల్లా వీపుపై తెల్లటి జుట్టు వస్తుంది, అప్పుడు దానిని సిల్వర్ బ్యాక్ గొరిల్లా అని పిలుస్తారు. ఈ వయస్సులో గొరిల్లాకు అపారమైన భుజ బలం, కండ బలం ఉంటాయి. గుండెలపై బాదుకుంటూ తన శత్రువును యుద్ధానికి ఆహ్వానిస్తుంది. ఇది దాని పరిణతి, బలానికి చిహ్నం.
సింహం, గొరిల్లా సాధారణంగా ఒకదానికొకటి ఎప్పుడూ ఎదురుపడవు, ఎందుకంటే అవి వేర్వేరు ప్రదేశాలలో నివసిస్తాయి. సింహాలు పొడిగా ఉండే సవాన్నా ప్రాంతాలను ఇష్టపడతాయి, అక్కడ జింకల వంటి జంతువులను వేటాడటం సులభం. దీనికి విరుద్ధంగా, గొరిల్లాలు ఎక్కువగా వర్షాలు పడే పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి. ఒకవేళ ఊహాతీతమైన పరిస్థితులలో ఈ రెండూ ఒకదానికొకటి ఎదురై, ఘర్షణకు దిగితే ఏది గెలుస్తుందో ఒకసారి అనాలసిస్ చేద్దాం…
Also Read: చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
మగ సింహం 180–230 కేజీల బరువు ఉంటుంది. పదునైన పంజాలు, శక్తివంతమైన దవడ, వేటలో అనుభవం దీని సొంతం. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా దూకి దాడి చేసే శైలికి అవతలి జంతువులు కుదేలవుతాయి. గొరిల్లా 140–200 కేజీల బరువు ఉంటుంది. అంటే మనిషి కంటే 10 రెట్లు ఎక్కువ. అయితే అది సహజ వేటగాడు కాదు. రక్షణ కోసం మాత్రమే పోరాడుతుంది. దవడ బలం ఎక్కువే కానీ దూకుడు తక్కువ. నెమ్మదిగా కదిలే, నేలపైన బలం ఎక్కువగా ఉపయోగించే తత్వం ఉంటుంది.
ఇవి రెండు తలపడితే సింహం గెలిచే అవకాశం ఎక్కువ. ఎందుకంటే సింహం ప్రొఫెషనల్ ప్రెడేటర్. రోజూ వేట చేస్తుంది, శరీరం దాడి కోసం డిజైన్ అయినది. పంజా దెబ్బలు, దవడ బలం గొరిల్లాకు ప్రమాదకరం. చురుకుదనం, వేగం సింహానికి పెద్ద అడ్వాంటేజ్. అయితే గొరిల్లాను తక్కువ అంచనా వేయకూడదు. గొప్ప శారీరక బలం, గ్రిప్ పవర్ దాని సొంతం. ఆగ్రహానికి లోనైతే ఒక్క పంచ్‌తో తీవ్రమైన నష్టం చేయగలదు. సింహం ప్రొఫెషనల్ కిల్లర్. గొరిల్లా పవర్‌ఫుల్ కానీ డిఫెన్సివ్. మొత్తంగా చూస్తే సింహం గెలిచే అవకాశాలు 70–80% అధికం. గొరిల్లా గెలిచే అవకాశం సింహం పొరబడినప్పుడు మాత్రమే.