నమ్మలేని నిజం..ఆ ట్యాలెంట్ మనుషులకే కాదు చేపలకూ ఉందట..!

Human Intelligence in Fish: చేపలకు జ్ఞాపకశక్తి ఉండదనేది కేవలం అపోహ మాత్రమేనని ఓ పరిశోధన వెల్లడించింది. చిన్న మెదడు ఉన్నప్పటికీ, నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలు మనుషుల మాదిరిగానే ఇతరులను గమనించి నేర్చుకుంటాయట. మెరుగైన ఫలితం కోసం తమ నిర్ణయాలను మార్చుకోవడం వంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

నమ్మలేని నిజం..ఆ ట్యాలెంట్ మనుషులకే కాదు చేపలకూ ఉందట..!
Human Intelligence In Fish
Image Credit source: AI

Updated on: Jun 20, 2026 | 1:08 PM

చేపలకు జ్ఞాపకశక్తి ఉండదని, వాటి మెదడు చాలా చిన్నదని మనం తక్కువ అంచనా వేస్తుంటాం. కానీ చేపలు మనం అనుకున్నదానికంటే చాలా తెలివైనవని, వాటి నేర్చుకునే విధానం మనుషుల ఆలోచనా సరళికి చాలా దగ్గరగా ఉంటుందని కొన్నేళ్ల క్రితం ఒక పరిశోధనలో తేలిందని మీకు తెలుసా..?  యూరప్‌లో సాధారణంగా కనిపించే నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ (Nine-spined stickleback) అనే ఒక రకమైన చేప జాతి ఉంది. ఇవి మనుషుల లాంటి సామాజిక అభ్యాస వ్యూహాన్ని ప్రదర్శిస్తుందని డర్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతు ప్రపంచంలో ఇలాంటి సామర్థ్యం ఉన్నట్లు గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

హిల్-క్లైంబింగ్ వ్యూహం గురించి తెలుసా..?

మానవ సమాజంలో సాంకేతికత లేదా జీవన విధానం అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇతరులు చేసే పనులను గమనించి, అందులో అత్యుత్తమమైన పద్ధతిని ఎంచుకుని, దానిని మరింత మెరుగుపరచడాన్ని మనుషులు అలవాటు చేసుకున్నారు. దీనినే ‘హిల్-క్లైంబింగ్’ (Hill-climbing) వ్యూహం అంటారు. యూరప్‌లో కనిపించే నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలు కూడా ఇతరుల ప్రవర్తనను తమ స్వంత అనుభవంతో పోల్చి చూసుకుంటాయట. తమ పాత పద్ధతి కంటే ఇతరులు చేసే పద్ధతి ద్వారా ఎక్కువ ఆహారం లభిస్తుందని గ్రహిస్తే.. అవి వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుని ఆ కొత్త పద్ధతినే ఫాలో అవుతాయని డర్హామ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

పరిశోధన జరిగిందిలా..

పరిశోధన కోసం 270 స్టిక్ల్‌బ్యాక్ చేపలను సేకరించి ల్యాబొరేటరీ అక్వేరియంలలో ఉంచారు. వీటిని వేర్వేరు గ్రూపులుగా విభజించి ఒక ఆసక్తికరమైన పరీక్ష పెట్టారు. రెండు దశల్లో ఈ పరీక్ష పెట్టారు. మొదటి దశలో ట్యాంక్‌కు ఇరువైపులా రెండు ఫీడర్లను (ఆహారం ఇచ్చే పరికరాలు) అమర్చారు. ఒక వైపు ఎక్కువ పురుగులు (ఆహారం), మరోవైపు తక్కువ పురుగులు వచ్చేలా సెట్ చేశారు. చేపలు సొంతంగా ఏ వైపు ఎక్కువ ఆహారం దొరుకుతుందో గుర్తుంచుకున్నాయి. రెండో దశలో శాస్త్రవేత్తలు ఫీడర్ల స్థానాలను మార్చేశారు. అంటే గతంలో తక్కువ ఆహారం వచ్చిన వైపు ఇప్పుడు ఎక్కువ ఆహారం వచ్చేలా చేశారు. ఈ మార్పును చేపలు కేవలం బయటి నుండి వేరే చేపలు తింటుండగా చూసి గమనించేలా చేశారు.

ఇవి కూడా చదవండి

ఇతరుల ఐడియాలో కాపీ కొట్టే మానవ మేధస్సు..

ఫలితంగా.. దాదాపు 75 శాతం చేపలు తమ సొంత పాత అనుభవాన్ని పక్కన పెట్టి, కేవలం వేరే చేపలను గమనించడం ద్వారా ఏ వైపు ఎక్కువ ఆహారం వస్తుందో సరిగ్గా గుర్తించి ఆ వైపే వెళ్లాయి. అంటే మెరుగైన ఫలితాల కోసం ఇతరుల ఐడియాలను కాపీ కొట్టే మేధస్సు మనుషులకే కాదు చేపలకు కూడా ఉందని ఈ పరిశోధనలో తేలింది.

చిన్న చేపలకు చిన్న మెదడు ఉండవచ్చు, కానీ వాటికి అద్భుతమైన సంజ్ఞానాత్మక సామర్థ్యాలు ఉన్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జెరెమీ కెండల్ తెలిపారు. సామాజికంగా విషయాలు నేర్చుకునే విషయానికి వస్తే మెదడు పరిమాణం అంతా కాదని మా పరిశోధన నిరూపించిందని తెలిపారు. తమ స్వంత అనుభవం కంటే మెరుగైన ఫలితం వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను కాపీ కొట్టే ఈ విలక్షణమైన ‘మానవ మేధస్సు’ చేపల్లో కూడా ఉండటం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.

Also Read: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!

Follow Us