Aadhaar card Fact Check: ఆధార్.. భారతదేశ పౌరుడికి ఇది ఎంతో కీలకం. సమస్తం సమాచారం ఒక్క కార్డులోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే ఆధార్ కార్డు ఏదో ఒక సందర్భంగా ప్రతీ ఒక్కరికి అవసరం అవుతుంటుంది. ముఖ్యంగా గుర్తింపు కార్డు కోసం, ఆహార భద్రత కార్డు కోసం, లేదా ఒక వ్యక్తి చిరునామా కోసం ఇలా అనేక రకాలుగా ఆధార్‌ను ప్రమాణికంగా అడుగుతారు. అయితే, కొందరు కేటుగాళ్లు ఆధార్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ ఆధార్ సృష్టించి తమ పనిని కానిచ్చేస్తున్నారు. అందుకే వారు ఇచ్చిన ఆధార్ కార్డు నకిలీదా? ఒరిజినలా? అనేది ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా, భవిష్యత్తులో ఎదురయ్యే చిక్కులను ఆదిలోనే అంతం చేయొచ్చు, నకిలీ ఆధార్‌కు చెక్ పెట్టొచ్చు. మరి నకిలీ ఆధార్‌ను గుర్తించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు ఇప్పుడు అవసరమైన ధృవీకరణ పత్రాలలో అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలను పొందడం మొదలు.. ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. కారణం.. దానిపై ఉన్న చిరునామా రుజువుగా ఉపయోగించబడుతోంది. అయితే కొందరు మాయగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ సంస్థ ఉడాయ్(UIDAI) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో రెండు నిమిషాల్లోనే ఆధార్ కార్డు నిజమైనదా? నకిలీదా? ఇట్టే తేల్చుకోవచ్చు. అయితే, నకిలీ ఆధార్‌ను గుర్తించడానికి ఆధార్ సెంటర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా పని పూర్తి చేయవచ్చు. కేవలం మొబైల్‌లోనే దీన్ని చెక్ చేయొచ్చు. అదెలాగంటే..
ఆధార్ కార్డు నకిలీదని ఎలా గుర్తించాలి?
ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా మీరు ఏదైనా ఆధార్ కార్డును తనిఖీ చేయవచ్చు. మీరు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్‌ను ట్రాక్ చేసే విధంగానే ఆధార్ కార్డు సమాచారాన్ని పొందవచ్చు. ముందుగా ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత.. వేరిఫై ఆధార్ అని ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేయగానే.. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. అందుకోసం ఒక టెక్ట్స్ బాక్స్‌ను చూపిస్తుంది. ఆ బాక్స్‌లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. దాని కింద బాక్స్‌లో క్యాప్చా(సెక్యూరిటీ కోడ్) ఉంటుంది. దానిని కూడా ఎంటర్ చేయాలి. అలా నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత వేరిఫై ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ సరైనదయితే.. వెంటనే దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. కార్డు దారుని పేరు, ఊరు, వయసు తదితర అన్ని వివరాలు కనిపిస్తాయి. కార్డు దారుని ఫోటో కూడా అందులో కనిపిస్తుంది. అప్పుడు మన చేతిలో ఉన్న ఆధార్ కార్డుపై ఉన్న వివరాలు, వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను సరిపోల్చుకోవాలి. రెండూ ఒకేవిధంగా ఉన్నట్లయితే ఆ కార్డు నిజమైనదని భావించాల్సి ఉంటుంది. లేదంటే అది నకిలీదనే తేల్చుకోవాలి.
mAadhaar యాప్‌లోనూ ఆధార్ కార్డును వేరిఫై చేయొచ్చు..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం కొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ పక్రియ పూర్తవగానే mAadhaar అప్లికేషన్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. అందులో వేరిఫై ఆధార్ అని స్కాన్ ఆప్షన్ మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ స్కానర్ సాయంతో ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసిన వెంటనే కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు కళ్లముందు ఉంటాయి. ఆ వివరాలను, కార్డు పై ఉన్న వివరాలతో సరిపోల్చి అది నకిలీదా? నిజమైనదా? నిర్ధారించవచ్చు.
ఇప్పుడు ఐదుగురు వ్యక్తులకు ఒకే ఫోన్ నెంబర్‌తో..
ఉడాయ్(UIDIA) అధికారిక సమాచారం ప్రకారం.. ఒకే ఫోన్ నెంబర్‌తో 5 ఆధార్ ప్రొఫైల్స్ ధృవీకరించవచ్చు. ఉదాహరణకు.. ఆధార్‌కు సంబంధించి మీరు ఒక అప్లికేషన్‌ను(mAadhaar) డౌన్‌లోడ్ చేసుకుంటే, ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తుల ఫ్రొఫైల్స్ కూడా దీనికి అనుసంధానం చేయొచ్చు. మీ గానీ, మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే ఇలా సులభతరం అవుతుంది. అయితే, వివరాలు మార్చిన తరువాత వచ్చే OTP ఆధార్ కార్డు హోల్డర్ ఖాతాలో(ఫోన్ నెంబర్)కు వస్తుంది. అప్పుడు వారి నుంచి ఓటీపీని తీసుకుని ఆధార్ కార్డు వివరాలను మార్చుకోవచ్చు.
Also read:
మయన్మార్ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందించిన ఫేస్‌బుక్.. మిలటరీ ఖాతాలపై నిషేధం..!