
ఈరోజు తేదీ ఎంత..? అని ఎవరైనా అడిగితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్మార్ట్‌ఫోనో లేదా గోడకు ఉన్న క్యాలెండరో చూసి గ్రెగోరియన్ పద్ధతిలో సమాధానం చెప్పేస్తాం. కానీ మనం చూస్తున్న ఆ తేదీల వెనుక వేల ఏళ్ల చరిత్ర, ఖగోళ శాస్త్ర రహస్యాలు,భిన్న సంస్కృతుల జీవనశైలి దాగి ఉందని మీకు తెలుసా? మానవ నాగరికత పరిణామ క్రమంలో కాలాన్ని బంధించడానికి మనిషి చేసిన ప్రయత్నమే క్యాలెండర్. ప్రకృతి ఒడిలో సూర్యుడి ప్రతాపాన్ని, చంద్రుడి వెన్నెల వెలుగులను గమనిస్తూ.. నక్షత్రాల గమనాన్ని లెక్కగడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతులు తమదైన శైలిలో కాలాన్ని కొలవడం నేర్చుకున్నాయి. ప్రస్తుతం మన భూమిపై దాదాపు 40కి పైగా భిన్నమైన క్యాలెండర్లు వాడుకలో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
భారతదేశం, నేపాల్ సంస్కృతులకు పునాది ఈ క్యాలెండర్. ఇది సూర్య మరియు చంద్ర చక్రాలు రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఒక నెలను శుక్ల పక్షం, కృష్ణ పక్షం అని రెండు భాగాలుగా విభజిస్తారు. మొత్తం 30 తిథులు ఉంటాయి. పండుగలు, శుభ ముహూర్తాలను నిర్ణయించడంలో దీనికి సాటిలేదు.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఆఫీసు పనులకు, పరిపాలనకు వాడేది ఇదే. దీనిని 1582లో పోప్ గ్రెగరీ XIII ప్రవేశపెట్టారు. ఇది పూర్తిగా సౌర చక్రంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరం’ (366 రోజులు) దీనిలోని ప్రత్యేకత.
ముస్లిం సోదరులు రంజాన్, హజ్ వంటి పవిత్ర దినాలను నిర్ణయించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన చంద్రమాన క్యాలెండర్. సంవత్సరానికి కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. అందుకే పండుగలు ప్రతి ఏటా 10-11 రోజులు ముందుకు జరుగుతుంటాయి.
చైనా సంస్కృతిలో చంద్రుడు మరియు సూర్యుడు ఇద్దరినీ అనుసరిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరానికి ఒక జంతువు పేరు పెడతారు. దీనికి చైనీస్ జ్యోతిష్యంతో విడదీయలేని సంబంధం ఉంది.
యూదు మతస్థులు అనుసరించే హిబ్రూ విధానంలో సంవత్సరానికి 354 నుండి 385 రోజుల వరకు మారుతూ ఉంటాయి. ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధ క్యాలెండర్ ప్రసిద్ధి. ఇది ప్రాథమికంగా మన హిందూ పంచాంగంలోని గణనలను పోలి ఉండటం విశేషం. కాగా క్యాలెండర్ ఏదైనా.. కాలం గమనాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రకృతితో మమేకం అవ్వడానికి మానవుడు సృష్టించుకున్న అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం ఇది.