ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వస్తోంది. మనలోని చాలామంది గ్రహణాన్ని ఆశుభంగా భావిస్తారు. ఆ సమయంలో బయట తిరగకూడదని, భోజనం చేయకూడదని, గర్భిణీ స్త్రీలు అయితే గ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకి రాకూడదని పెద్దలు అంటుంటారు. కొందరికైతే.. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయట తిరిగితే పుట్టబోయే బిడ్డకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ కూడా ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం.? అసలు గ్రహణ సమయంలో గర్బిణీలు బయట తిరగకూడదా.? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంటి బయటకి రావడం వల్ల గ్రహణ మొర్రి వస్తుందనడంలో ఎలాంటి శాస్త్రీయతా లేదని పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రహణ మొర్రి అనేది బిడ్డ పిండం దశలో ఉండగా ఏర్పడే ఓ అవకరం. ప్రతీ వెయ్యి జననాల్లో ఒకరికి ఇలా గ్రహణ మొర్రి వస్తుంది. పిండం దశ నుంచి బిడ్డగా ఎదిగే సమయంలో తల భాగం రూపొందేందుకు దాదాపుగా 6 నుంచి 10 వారాలు పడుతుంది. ఆ సమయంలో ఒక్కోసారి బిడ్డకు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు మొర్రి ఏర్పడుతుంది. ప్రస్తుతం టెక్నాలజీతో పాటు సైన్స్ కూడా ఎంతగానో అభివృద్ధి చెందటంతో.. ఈ మొర్రి సమస్యను శస్త్రచికిత్స ద్వారా అధిగమించవచ్చు. కాగా, గ్రహణ సమయంలో అనుమానాలు, అపోహలు ఉండటం సహజమని.. వాటి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..