Y Chromosome : మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్.. మగజాతి మనుగడకే ముప్పు..!
ఆడా, మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్ల ఆనవాలే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? యస్..! వై క్రోమోజోముకు సంబంధించిన ఓ అధ్యయనం ఇలాంటి భయాలనే పుట్టిస్తోంది. అసలు మగవాళ్లలో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడానికి కారణమేంటి..?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైన వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మగవారిలో ఆ y క్రోమోజోము ఉండదనీ, మగపిల్లలు పుట్టే అవకాశం పోయి, మగజాతి అంతరిస్తుందని అంచనా వేస్తున్నారు.
జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95 శాతానికి పైగా కృశించిపోయినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్‌ను భవిష్యత్తులో పూర్తిగా మర్చిపోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే దీనిక కారణమని వైద్యులు చెబుతున్నారు. దూమపానం, మద్యపానం, ఊబకాయం, శరీరం బరువు పెరగడం, వృషణాలు వేడెక్కడం, డ్రగ్స్ ఉపయోగించడం, ఒత్తిడి, ఆందోళనలు పెరగడం ఇవన్నీ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి దారి తీస్తున్నాయి. రెడీయేషన్ ప్రభావంతో కూడా వై క్రోమోజోమ్ తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ప్రభావంతో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
Y క్రోమోజోములో 1438 జన్యువులు ఉంటాయి. కానీ కాలక్రమేణా ఇప్పటికీ వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అలా ఆ 45 జన్యులు పోవడానికి కొన్ని వేల ఏళ్లు పడుతుంది. ఆ తరువాత మానవ జాతిలో అందరూ ఆడపిల్లలే ఉంటారేమో. ఇలా మగ క్రోమోజోములు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త జన్యువులు పుట్టే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.