Moral Story: తెలివైన మేకపిల్ల: పరివారమంతా చనిపోయినా తన జీవితం ఎలా కాపాడుకుందంటే..?

ఒక తెలివైన మేకపిల్ల తన బుద్ధిబలంతో రెండు నక్కల కుతంత్రాల నుంచి తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో ఈ కథ వివరిస్తుంది. పదునైన ఆలోచనలతో నక్కలు వేసిన పన్నాగాలను ఛేదించి, చివరికి వాటిని భయపెట్టి తరిమి కొట్టి, తన తెలివితేటలను చాటి చెప్పింది. పిల్లలకు నీతిని బోధించే ఒక ఆసక్తికరమైన కథ ఇది.

Moral Story:  తెలివైన మేకపిల్ల: పరివారమంతా చనిపోయినా తన జీవితం ఎలా కాపాడుకుందంటే..?
Clever Goat Story

Updated on: Oct 07, 2026 | 11:18 AM

ఒక అడవిలో ఒక నక్క దంపతులు ఆహారం కోసం వెతుకుతూ ఒక పచ్చిక బయలున్న మైదానానికి చేరుకున్నాయి. అక్కడ చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది. మగనక్క వెంటనే మేకలపై దాడి చేయాలనుకోగా, ఆడనక్క వారించి, తొందరపడవద్దని సలహా ఇచ్చింది. మేకలు చెల్లాచెదురు కాకుండా, వాటి వెనకగా వెళ్లి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వేటాడదామని, ఇలా ప్రతిరోజూ ఒక మేకను చంపి ఆహార కొరత లేకుండా చూసుకోవచ్చని పన్నాగం పన్నింది. మగనక్క భార్య ఉపాయానికి తలూపింది. కొద్దిరోజుల తర్వాత, గుంపులోని ఒక మేక దారి తప్పి అడవిలోకి వెళ్లగానే, నక్కలు దానిపై దాడి చేసి చంపేశాయి. ఆ రోజు నుంచి నక్కల జంట రోజుకొక మేకను చంపి తినసాగింది. నెమ్మదిగా గుంపులో మేకల సంఖ్య తగ్గసాగింది. చివరకు ఒకే ఒక మేక మిగిలింది. తన బంధువులందరూ నక్కల బారిన పడి మరణించారని తెలుసుకున్న ఆ మేక, భయంతో ఒక చిన్న గుహలో ఉండి బయటికి రావడం మానేసింది. చుట్టుపక్కల చెట్ల ఆకుల్ని, కాయల్ని తిని కడుపు నింపుకుంటూ తెలివిగా జీవించసాగింది.

గుహలో ఇంకో మేక ఇంకా బతికే ఉందని నక్కలకు తెలిసింది. అది చాలా తెలివైందని, దాన్ని గుహ నుంచి బయటకు రప్పించడం కష్టమని ఆడనక్క చెప్పింది. అప్పుడు మగనక్క ఒక పథకం ఆలోచించి భార్యకు వివరించింది. మరుసటి రోజు ఆడనక్క మేక ఉండే గుహ వద్దకు వెళ్లి, గుహ బయట కూర్చొని ఎదురుచూడసాగింది. “చెల్లెలా, నన్ను చూసి భయపడవద్దు. నేను నీ స్నేహం కోరి వచ్చాను. నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు నాకు మిత్రులే లేరు” అని పిలిచింది. మేక అందుకు “నీవు నా బంధువులందరినీ చంపి తినేశావు. నీకు మైత్రి చేసే అర్హత లేదు. వెంటనే వెళ్ళిపో” అని తిరస్కరించింది. అయినా ఆడనక్క వదలకుండా, “నా భర్త వ్యవహారం చాలా క్రూరమైంది. అతనే నీ పరివారాన్ని చంపేశాడు. దానికి నేను బాధ్యురాలినా? అతని దుర్మార్గాలపై కోపం వచ్చినప్పుడు నా బాధను పంచుకోవడానికి ఎవరూ లేరు. నా దుఃఖాన్ని నీతో పంచుకొని మనసుకు శాంతిని పొందాలనుకుంటున్నాను” అని బతిమాలింది. మేక మొదట సంశయించినా, గుహలో ఉండి మాట్లాడటంలో అపాయం లేదని భావించి, ఆడనక్కతో మాట్లాడటం మొదలుపెట్టింది. తొందరగానే వారిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ప్రతిరోజూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు, కానీ మేక మాత్రం తన గుహ నుండి బయటకు వచ్చేది కాదు. ఒకరోజు ఆడనక్క ఏడుస్తూ మేక వద్దకు వచ్చి, “నిన్న రాత్రి నా భర్త మరణించాడు. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ సహాయపడటం లేదు. అతని ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుందో?” అని వాపోయింది. మేక, “నీ భర్త దుష్టుడు, హంతకుడు. అతని కోసం నేను ఎక్కడికి రాను” అని అంది. దానికి ఆడనక్క, “అతను చనిపోయాడు కదా, ఇప్పుడు నీకు ఏ హాని తలపెట్టలేడు” అని బతిమాలింది. ఈ మాటలు నమ్మిన మేక, తన మిత్రురాలికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో నక్క వెంట బయలుదేరింది. గుహ ద్వారానికి సమీపానికి చేరుకోగానే, కాస్త దూరంలో మగనక్క మృతకళేబరం కనిపించింది. వాస్తవానికి అది చచ్చిపడినట్లు నటిస్తున్నది. అది ఆత్రుతతో కళ్ళు తెరిచి దొంగచూపుగా మేకను చూసింది. మేక వెంటనే గమనించింది. మగనక్క బతికే ఉందని గ్రహించి, క్షణాల్లో చెంగుచెంగున పరుగు తీసి తన గుహకు చేరుకుంది. మగనక్క సహనం కోల్పోయి మొత్తం పథకాన్ని పాడుచేసినందుకు ఆడనక్క కోపగించుకుంది. మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పి, ఆడనక్క మరుసటి రోజు గుహ వద్దకు వెళ్లి “చెల్లెమ్మా, నువ్వు గుహలోనే ఉన్నావా?” అని పిలిచింది. మేక, “వెళ్ళిపో, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. నీవు విశ్వాసఘాతకురాలివి. నీ భర్త చనిపోయాడని అబద్ధం చెప్పావు” అని కోపంగా అంది. దానికి ఆడనక్క, జరిగిందంతా అద్భుతంలా ఉందని, మేక మంచి మనసున్న మహాశక్తిగలదని, ఆమె రాగానే తన భర్త మృతశరీరంలోకి జీవం ప్రవేశించిందని, అతను మేకకు ధన్యవాదాలు తెలపమన్నాడని, తన సంబంధీకులను చంపినందుకు బాధపడుతున్నాడని, క్షమించమని కోరిందని కొత్త అబద్ధాలు చెప్పింది.

మేక ఆ మాటలను నమ్మినట్లు నటించి, “నేను తప్పక వస్తాను అక్క. నేను నీ స్నేహితురాలిని కదా. నీవు వెంటనే ఇంటికి బయలుదేరు. నేను మధ్యాహ్నం భోజనానికి బదులు రాత్రి భోజనానికి వస్తాను. అంతేకాదు, నా వెంట 2000 మంది సహచరులను తీసుకు వస్తాను. వారందరికీ భోజనం తయారు చేయి” అని చెప్పింది. 2000 మంది అనుచరులు ఎవరు అని ఆడనక్క ప్రశ్నించగా, “వారంతా నా మిత్రులు. వారు పట్టణంలో నివసిస్తూ ఉంటారు. ప్రేమగా వారిని కుక్కలని పిలుస్తారు” అని చెప్పింది. “కుక్కలా?” అని భయపడిన ఆడనక్క, “నువ్వు గుహలోనే ఉండటం మంచిది. గుహలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని విన్నాను. నువ్వు ఇంటిని సంరక్షించుకోవడానికి ఇక్కడే ఉండటం మరీ మంచిది” అని చెప్పి భయంతో పరుగుతీసింది. ఆడనక్క భర్త వద్దకు వెళ్లి మేక చెప్పిన 2000 మంది కుక్కల గురించి చెప్పగానే, మగనక్కకు వెన్నులో వణుకు పుట్టుకొచ్చి కంపించిపోయింది. దాంతో ఆ రెండు నక్కలు తోక ముడుచుకొని అడవిలోకి పరుగెత్తాయి. ఈ విధంగా ఒంటరిగా ఉన్న తెలివైన మేక తన బుద్ధి కుశలతతో, లౌక్యంతో రెండు క్రూరమైన నక్కల నుంచి తన ప్రాణాలు కాపాడుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us