బట్టతల..ప్రస్తుత జనరేషన్‌లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. పట్టుమని పాతికేళ్లు కూడా నిండాకుండానే చాలామందిని బట్టతల సమస్య వేధిస్తోంది. ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, పోషకాల లోపం, ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేయడం, తలలో ఇన్ఫెక్షన్స్, మద్యపానం, ధూమపానం ఇలా రకరకాల కారణాల వల్ల బట్టతల ఏర్పడుతుంది. అయితే, ఇప్పుడు బట్టతల వారిని ఏయ్ బట్టతల, ఓయ్ బట్టతల అంటే మామూలుగా ఉండదట. ఎవరైనా, ఎవరినైనా అలా పిలిచారంటే..తప్పదు మరీ భారీ మూల్యం..లైంగిక వేధింపుల కేసుతో కోర్టుల చుట్టూ తిరగాల్సిందే… అదేంటో తెలుసుకోవాలంటే..పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఏయ్ బట్టతల అని పిలిచినందుకు గానూ ఓ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. బ్రిటన్ లోని వెస్ట్ యార్క్‌షైర్ బ్రిటిష్ బంగ్ కంపెనీలో 24 ఏళ్లపాటు పనిచేసిన టోనీ ఫిన్ అనే వ్యక్తి ఈ మేరకు కోర్టును ఆశ్రయించాడు. ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ జేమీ కింగ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. 2019 జూలైలో జేమీ కింగ్ తనను “బట్టతల’ అని పిలిచారని, అంతటి ఆగకుండా నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడాడని ఫిన్ ఆరోపించాడు. ఫిన్ పిటిషన్‌పై ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తన తీర్పును వెలువరించింది. ఈ ప్యానెల్‌కు న్యాయమూర్తి జోనాథన్ బ్రెన్ నేతృత్వం వహించారు. ముగ్గురు లాయర్ల బృందంలోని ఓ లాయర్ మాట్లాడుతూ..ఆడ, మగవారిలోనూ ఈ బట్టతల సమస్య ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా జుట్టురాలే సమస్యల ఏర్పాడుతుంది. కాబట్టి ఏ వ్యక్తినీ బట్టతల అనే పదాన్ని ఉపయోగించడం ఒక రకమైన వివక్షగా వారు పరిగణించారు. అంతేకాదు, మగవారిని బట్టతల అని పిలవడాన్ని, మహిళ రొమ్ము గురించి మాట్లాడడంతో సమానమని పోల్చింది ఈ తిసభ్య కమిటీ. బట్టతల అనే పదానికి.. సెక్స్ అనే పదానికి మధ్య సంబంధం ఉందని అని ప్యానెల్ వాధించింది. వాదనలు విన్న కోర్టు..ఆ పదం అవమానకరమైనదేనని పేర్కొంది. ఇది ఫిన్ గౌరవాన్ని దెబ్బతీసిందని కోర్టు అభిప్రాయపడింది.