Raksha bandhan: ఒక్కప్పుడు రాఖీ పండగ వచ్చిందంటే ఆ ఇంటిలోని వారందరికి నిజమైన పండగ. అన్నా చెల్లెలు ఒక చోటకి చేరి ఆనందంగా గడిపేవారు. కానీ అనూహ్య ఘటన వారిని రక్షా బంధన్ నుండి వీడదీసింది. ప్రమాదంలో చెల్లి చనిపోయింది. ఆమె దూరమై 7 నెలలు కావస్తోంది. దిగమింగుకోలేదని బాధ, చెల్లి దూరమైందన్న ఆవేదనతో ఆ కుటుంబం కోలుకోలేకపోయింది. ఇంతలోనే అన్నా-చెల్లెల బంధాన్ని గుర్తుకు చేసే రక్షాబంధన్ వచ్చింది. ప్రతీయేటా చెల్లి అన్నలకు కట్టే రాఖీ సమయం కళ్లముందే కదలాడుతుంది. ఆ బాధను దిగమింగుకోవాలంటే చెల్లి ఇంటిలో ప్రత్యక్షమవ్వాలన్న అన్నల ఆలోచనకు ప్రతిరూపం ఏర్పడింది. ఆ రూపం సమక్షంలో రాఖీ కట్టించుకుని చెల్లితో ఉన్న బంధాన్ని పంచుకున్నారు అన్నలు. అంతే కాదు ఇంటి బయట చెల్లి ఫ్లెక్సీ కూడా పెట్టారు. ‘ఆడపడుచులు అందరూ బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి.. నా చెల్లి బైక్ ప్రమాదంలో మరణించింది. ఆమెలా ఎవరికీ జరగకూడదు’ అంటూ రాసి పెట్టిన ఫ్లెక్సీ అందరినీ కంట తడి పెట్టిస్తుంది.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన మణి(29) 7 నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందింది. ఆమె వివాహితురాలు. భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో కుంగిపోయిన అన్న శివ, తమ్ముడు రాజా, అక్క వరలక్ష్మీలకు ఓ ఆలోచన వచ్చింది. చనిపోయిన మణి విగ్రహాన్ని తయారు చేయించారు. గ్రామమంతా ర్యాలీ చేసి పండగ చేశారు. అక్క వరలక్ష్మీచే రాఖి కట్టించుకోవడమే కాకుండా, ఆమె ద్వారా మరో సోదరి ప్రతిమ రూపంతోనూ రాఖీ కట్టించుకున్నారు. ప్రతీయేటా విగ్రహం దగ్గరే రాఖీ వేడుకలు చేస్తామన్నారు మృతురాలు మణి సోదరులు.
సత్య, టీవీ9 తెలుగు, కోనసీమ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..