
సాధారణంగా సువాసన ఎక్కువ సేపు ఉండాలని చాలామంది మెడపై లేదా గొంతుపై నేరుగా స్ప్రే చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం చర్మ సమస్యలే కాకుండా లోపల ఉండే కీలకమైన గ్రంథులు దెబ్బతినే ప్రమాదం ఉందట. సంతానోత్పత్తి, పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ ఆసక్తికరమైన నిజాలు తెలిస్తే మీరు ఇకపై పెర్ఫ్యూమ్ వాడే విధానాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు.
సంతానోత్పత్తి నిపుణుడు డాక్టర్ క్రిస్టబెల్ అకినోలా తన తాజా పరిశోధనలో ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మెడపై ఉండే చర్మం శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా సన్నగా, సున్నితంగా ఉంటుంది. ఇక్కడ రక్త ప్రసరణ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం నేరుగా మెడపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు, అందులోని రసాయనాలు సులభంగా చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుపోతాయి. సరిగ్గా ఇదే ప్రాంతానికి కొంచెం కిందుగా థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. మనం చేసే ఈ చిన్న పొరపాటు నేరుగా ఆ గ్రంథి పనితీరును దెబ్బతీస్తుంది.
థైరాయిడ్ అనేది మన శరీరంలోని అత్యంత కీలకమైన భాగం. ఇది మన బరువు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, హృదయ స్పందన రేటు మాత్రమే కాకుండా.. రుతుస్రావం, సంతానోత్పత్తి, గర్భధారణ వంటి పనులను నియంత్రిస్తుంది. పెర్ఫ్యూమ్‌లోని కెమికల్స్ ఈ గ్రంథిని ప్రభావితం చేస్తే మొత్తం శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
దీనివల్ల బాడీ ఇన్‌బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. హార్మోన్ల తేడాతో అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. రోజంతా నీరసంగా, ఉత్సాహం లేకుండా అనిపిస్తుంది. శరీరంలోని వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం తప్పుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో పిండం పెరుగుదలపై కూడా ఇది ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
చాలా పెర్ఫ్యూమ్స్‌లో ‘ఎండోక్రైన్ డిస్రప్టర్స్’ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి మన హార్మోన్ల పనితీరును నాశనం చేస్తాయి. ప్రతిరోజూ మెడపై స్ప్రే చేయడం వల్ల ఈ కెమికల్స్ క్రమంగా శరీరంలో పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే చర్మంపై నేరుగా స్ప్రే చేయడం కంటే బట్టలపై స్ప్రే చేయడం సురక్షితమని వైద్యులు సూచిస్తున్నారు.
అందం, సువాసన కోసం మనం చేసే పనులు ఆరోగ్యాన్ని బలి తీసుకోకూడదు. పెర్ఫ్యూమ్ వాడకంలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.