
చాలా మంది గట్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ప్రొబయోటిక్స్, ఫైబర్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ వంటి వాటిపై దృష్టి పెడతారు. కానీ జీర్ణక్రియ మన నోటిలోనే మొదలవుతుంది అన్న విషయం చాలా మందికి గుర్తుండదు. మన నోరు కేవలం ఆహారం ప్రవేశించే ద్వారం కాదు.. ఇది జీర్ణవ్యవస్థకు, రోగనిరోధక శక్తికి మొదటి రక్షణ గోడ లాంటిది.
నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే.. దాని ప్రభావం నేరుగా మన పేగుల ఆరోగ్యం మీద కనిపిస్తుంది. నోటిలో ఏర్పడే హానికర బ్యాక్టీరియా కేవలం దంతాలను పాడుచేయడం మాత్రమే కాదు.. అవి లోపలికి ప్రయాణించి పేగుల మైక్రోబయోమ్ ను అసమతులితంగా మార్చగలవు.
నోటి లోపల పెరిగే చెడు బ్యాక్టీరియా.. రక్తప్రవాహంలోకి చేరినప్పుడు శరీరమంతటా దెబ్బతీసే ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. ముఖ్యంగా గట్ లో ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగితే.. జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా నోటిలో నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వల్ల తినే ఆహారం సరిగ్గా నమలకపోవడం వల్ల.. కడుపు జీర్ణానికి ఆహారం పూర్తిగా సిద్ధంగా ఉండదు. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. తద్వారా శరీరం అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది.
ఆయుర్వేదం ప్రకారం నోటి ఆరోగ్యం శరీరంలోని సంపూర్ణ ఆరోగ్యానికి మూలాధారంగా భావించబడుతుంది. లవంగం, దారుచీని, త్రిఫల, దానిమ్మ లాంటి వాటితో తయారయ్యే టూత్ పేస్టులు కేవలం దంతాలను రక్షించడమే కాదు.. శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇవి చిగుళ్ల వాపు తగ్గించడంతో పాటు నోటి శుద్ధి, గట్ క్లీన్సింగ్ లో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.
నోటి శుభ్రతను చిన్న విషయం అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కేవలం రోజువారీ అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీవనశైలికి తొలి మెట్టు. సహజ పదార్థాలతో తయారైన దంత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం.. సరైన నోటి శుభ్రత అలవాట్లు పాటించడం వల్ల మన చిరునవ్వు మాత్రమే కాదు జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నోరు ఆరోగ్యంగా ఉంటే.. గట్ ఆరోగ్యం మెరుగవుతుంది. అదే విధంగా రోగనిరోధక శక్తి బలపడుతుంది.