పెళ్లి అయ్యాక ఎన్ని ఏళ్లకు ఐవీఎఫ్ చేయించుకోవాలి? డాక్టర్లు చెప్పే ఈ నిజాలు తెలుసుకోండి..

నేటి కాలంలో సంతానలేమి సమస్యతో లక్షలాది మంది దంపతులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. పెళ్లైన వెంటనే గర్భం దాల్చకపోతే వెంటనే ఐవీఎఫ్ చికిత్సకే వెళ్లాలా? పెళ్లయిన ఎంత కాలానికి డాక్టర్‌ను సంప్రదించాలి? అసలు ఐవీఎఫ్ ఎవరికి అవసరం? అనే విషయాలు ప్రతీ జంట తెలుసుకోవాలి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

పెళ్లి అయ్యాక ఎన్ని ఏళ్లకు ఐవీఎఫ్ చేయించుకోవాలి? డాక్టర్లు చెప్పే ఈ నిజాలు తెలుసుకోండి..
When Should You Consider Ivf

Updated on: Jul 28, 2026 | 8:35 AM

ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్య వేగంగా పెరుగుతుంది. గణాంకాల ప్రకారం.. 35 నుండి 49 సంవత్సరాల వయస్సు గల దాదాపు 5.36 కోట్ల మంది మహిళలు సహజంగా గర్భం దాల్చలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2036 నాటికి ఈ సంఖ్య 7.96 కోట్లకు చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు సంతానలేమిని కేవలం మహిళల సమస్యగానే భావించేవారు. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం దాదాపు 50 శాతం కేసుల్లో పురుషులకు ఉన్న ఆరోగ్య సమస్యలే కారణమవుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఒక అద్భుతమైన వరంగా మారింది.

ఐవీఎఫ్ అనేది మొదటి ప్రత్యామ్నాయం కాదా?

సంతానలేమి చికిత్సలో ఐవీఎఫ్ ఒక ఆధునిక సాంకేతికతే అయినప్పటికీ, ఇది ప్రతి దంపతులకు మొదటి ప్రత్యామ్నాయం కాదని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కేవలం జీవనశైలిలో మార్పులు, సరైన మందులు లేదా ఇతర చిన్న చిన్న చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. అందుకే పెళ్లయిన వెంటనే తొందరపడి ఐవీఎఫ్ వైపు వెళ్లకూడదు. అయితే పెళ్లి తర్వాత క్రమం తప్పకుండా ప్రయత్నించినప్పటికీ సంతానం కలగకపోతే ఆలస్యం చేయకుండా ఫెర్టిలిటీ నిపుణుడిని సంప్రదించాలి. ముఖ్యంగా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత తగ్గిపోతుంది.

పెళ్లయిన ఎంత కాలం తర్వాత ఐవీఎఫ్ గురించి ఆలోచించాలి?

స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ గరిమా వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం పెళ్లయి ఎన్ని రోజులైంది అనే దాని ఆధారంగా ఐవీఎఫ్ నిర్ణయం తీసుకోరు. దీనికి మహిళ వయస్సు, వైద్య పరీక్షల నివేదికలు, సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు పెళ్లయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోతే మొదట ఫెర్టిలిటీ టెస్టులు చేయించుకోవాలి. 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైద్య పరీక్షల తర్వాత సహజంగా గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలితే డాక్టర్లు వెంటనే ఐవీఎఫ్ సూచించవచ్చు.

ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత?

ఐవీఎఫ్ చికిత్స ప్రతిసారీ 100% విజయవంతమవుతుందని చెప్పలేము. ఇది మహిళ వయస్సు, అండాల నాణ్యత, శుక్రకణాల స్థితి, గర్భాశయ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

ఐవీఎఫ్ – ఐసీఎస్ఐ మధ్య తేడా ఏంటి?

సంతానలేమికి ఉన్న కారణాలను బట్టి ఐవీఎఫ్ లేదా ICSI సాంకేతికతను ఉపయోగిస్తారు. ICSI విధానంలో నిపుణులు ఒక ఆరోగ్యకరమైన శుక్రకణాన్ని ఎంచుకుని, దానిని నేరుగా అండం లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ICSI విధానం ముఖ్యంగా పురుషులలో ఉండే తీవ్రమైన సంతానలేమి సమస్యల పరిష్కారానికి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

Follow Us