రాత్రి నిద్రపోయే ముందు రీల్స్ చూడటం ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో మీకు తెలుసా.. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. రాత్రి నిద్రపోయే ముందు రీల్స్, షార్ట్ వీడియోలు చూసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందట. చైనా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ అలవాటు బీపీ సమస్యలు కలిగించే ప్రమాదాన్ని తెస్తుందని గుర్తించారు.
ప్రస్తుత కాలంలో ఫ్రీ టైమ్ దొరికిన ప్రతిసారీ చాలా మంది సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటారు. ఈ అలవాటు మీ టైమ్ ను వేస్ట్ చేయడమే కాకుండా.. ఒత్తిడి, నిద్రలేమి, ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చైనాలోని హెబేయ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు 4,318 మంది పై నిర్వహించిన అధ్యయనంలో వారు రాత్రిపూట రీల్స్ చూస్తున్న టైమ్ ఎలా ఉంటుందో పరిశీలించారు. జనవరి నుండి సెప్టెంబర్ 2023 వరకు జరిగిన ఈ అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం నాడీ వ్యవస్థ పనితీరుపై చెడు ప్రభావం చూపుతున్నట్లు తేలింది.
రాత్రిపూట ఎక్కువసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపేవారిలో రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు మెదడులో సింపాథిటిక్ నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపి అనేక అవాంఛిత ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందట.
ఈ అలవాటును తగ్గించడం ఎంతో అవసరం. రాత్రిపూట రీల్స్ చూడడం తగ్గించడంతో పాటు, బరువును అదుపులో ఉంచడం, చక్కెర స్థాయిలను నియంత్రించడం, నిద్రపోవడానికి ముందు ప్రశాంతమైన క్రియాకలాపాలను ఎంచుకోవడం ద్వారా బీపీ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.