
పెద్దవారి మాట చద్ధన్నం మూటా అనే సామెత మనందరికీ తెలిసిందే. చద్ధన్నం ప్రయోజనాలు తెలిస్తే ఈ సామెతకు పుట్టుకురావడానికి గల కారణం కూడా తెలుస్తుంది. దీని కారణంగా ఎన్నో వ్యాధులు వాటంతటవే నయమవుతాయి. సాదాగా, సులభంగా తయారయ్యే ఆహారం ఇది. అందుకే పూరి గుడిసెలో ఉండేవారికైనా కోటీశ్వరులకైనా అందుబాటులో ఉంటుంది. ఎవ్వరికైనా ఒకే విధమైన ఆరోగ్య ప్రయోజనాలకు చేకూరుస్తుంది. చెప్పాలంటే తల్లిలాంటి మేలు చేసే ఈ అన్నం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటి గురించి తెలుసుకోండి.
రక్తంలో ఎర్ర రక్తకణాలు తగినంత మోతాదులో లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. దీన్ని సరిచేయడం అంత తేలికైనది కాదు. అలాంటి సమస్య ఉన్న యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలు, మహిళలు ఉదయాన్నే చద్దన్నం,పెరుగు కలుపుకుని తింటే రక్తహీనతను దూరం చేస్తుంది. శరీరం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.
మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ ఇప్పుడు ఎంతో మందిని వేధిస్తున్న సమస్య. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక కొందరు సతమతమవుతుంటారు. మందులు వాడుకునే బదులుగా ఈ అన్నాన్ని ఓ సారి ట్రై చేయండి. దెబ్బకు కడుపు సమస్యలన్నీ పరారవ్వాల్సిందే. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడంలో సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారు కడుపు కట్టుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్త నోటికి రుచిగా ఏదీ తినలేరు. అందులోనూ అన్నం తినడం వారికి అంత మంచిది కాదు. కాబట్టి షుగర్ ఉన్నవారు జొన్నలతో చేసిన చద్ధన్నం తింటే ఇది మధుమేహాన్ని చక్కగా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాదు.. అధిక బరువును కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇది వీలుకాని వారు బ్రౌన్ రైస్ తో కూడా చద్ధన్నాన్ని చేసుకోవచ్చు. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.
పోషకాలకు రారాజు రాగి పిండి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రాగి చద్దన్నం అధిక ఆకలిని నియంత్రిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అరికెల చద్దన్నం వల్ల మూత్రపిండ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడుతుంది. దీని వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.
చద్దన్నం తినడం కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు మన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. ఇది మానసికి స్థితిని మెరుగుపరుస్తుంది. చద్దన్నంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, చర్మం ముడతలు, మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.