PCOS: మీ శరీరం ఇచ్చే ఈ కీలక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అంటే కేవలం క్రమరహిత పీరియడ్స్ మాత్రమే కాదు.. ఇది ఎన్నో ప్రభావాలను కలిగించ గల సమస్య. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తుంది. ఇది మహిళల ఆరోగ్యం పై చాలా రకాలుగా ప్రభావం చూపుతుంది.

PCOS: మీ శరీరం ఇచ్చే ఈ కీలక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
Pcos

Updated on: Jun 30, 2025 | 1:33 PM

PCOS ఉన్నవారిలో ఎక్కువగా మొటిమలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇవి సాధారణ మొటిమల కంటే తీవ్రంగా ఉంటాయి. ప్రధానంగా దవడ చుట్టూ చెక్కలపై కనిపించవచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల చర్మం ఎక్కువగా నూనె ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఈ సమస్య పెరుగుతుంది.

PCOS వల్ల ఆండ్రోజెన్స్ అధికంగా ఉండటంతో కొంతమందికి తలకు జుట్టు పల్చబడటం లేదా అధికంగా రాలడం కనిపించవచ్చు. అదే సమయంలో ముఖం, ఛాతీ, తొడలపై అనవసరంగా జుట్టు పెరుగుతుంది. దీనిని హిర్సూటిజం (హార్మోన్ సంబంధిత జుట్టు పెరుగుదల) అంటారు.

ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. శరీరం చక్కెరను సరిగ్గా ఉపయోగించలేకపోవడంతో బరువు పెరగడం మొదలవుతుంది. ఏ ప్రత్యేకమైన కారణం లేకుండా బరువు వేగంగా పెరగడం గమనించాల్సిన లక్షణం.

PCOS శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది. నిరాశ, ఆందోళన వంటి భావోద్వేగ సమస్యలు పెరిగే అవకాశముంది. ఇది శరీరంలో జరుగుతున్న హార్మోన్ల లోపం, నిద్ర లేమి, జీవనశైలి తేడాల కారణంగా కలుగుతుంది.

విచిత్రంగా అనిపించినా PCOS ఉన్నవారు చాలా సార్లు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేరు. ఇది మీ పట్టుదల లేనందు వల్ల కాదు.. శరీరంలోని జీవరసాయన మార్పుల కారణం.

PCOS ఉన్న చాలా మందిలో అలసట సర్వసాధారణం. రాత్రి నిద్ర సరిగా వచ్చినా.. ఉదయాన్నే శక్తి లేని భావన కలగడం PCOS లక్షణాల్లో ఒకటి.

మెడ, అరిచెయ్యి, కాళ్ళ మడతలలో ముదురు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే అది PCOS సూచన కావచ్చు. ఇది అధిక ఇన్సులిన్ స్థాయికి సంబంధించిన సూచన.

PCOS ఉన్న మహిళల్లో నిద్రలో అంతరాయం, గురక, నిద్రలేమి వంటి సమస్యలు తరచూ కనిపిస్తాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల స్థాయిలతో పాటు జీవనశైలి ప్రభావాలను సూచిస్తాయి.

PCOS వల్ల గర్భం ధరించడంలో ఇబ్బందులు రావచ్చు. అండం విడుదల మందగించడం లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చడం కష్టం అవుతుంది.

ప్రతి మహిళకు లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి జీవనశైలిలో మార్పులు, ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఆహారం, క్రమం తప్పని వ్యాయామం వంటివి పాటించడం మంచిది. అలాగే ఆరోగ్య నిపుణుని సలహా తీసుకోవడం అవసరమైన మందులు వాడటం ద్వారా ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యను దాచిపెట్టకుండా మాట్లాడటం ద్వారా అవగాహన పెరిగి సరైన చికిత్స తీసుకోవచ్చు.