భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఏం జరుగుతుంది? జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుంది
భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫార్ట్ వాక్స్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఇది కొత్త అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత స్వల్పంగా నడవడం జీర్ణక్రియకు చాలా కాలంగా సూచిస్తున్న సరళమైన అలవాట్లలో ఒకటని వివరిస్తున్నారు. ఈ చిన్న నడక కేవలం ఆహారం జీర్ణం కావడానికే కాదు, కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం నివారించడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణాశయ ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన తర్వాత ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

ఇంటి చుట్టూ, ఆఫీసులో లేదా బయట వీధిలో నెమ్మదిగా నడిచినా సరిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కఠినమైన వ్యాయామం చేయకుండా సాదాసీదా నడక మాత్రమే చేయాలని సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం కంటే కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అసౌకర్యం తగ్గుతుంది. ఈ అలవాటులో ప్రత్యేకమైన పరికరాలు లేదా ఖరీదైన ఫిట్‌నెస్ సామగ్రి అవసరం లేదు. ఎవరైనా సులభంగా రోజువారీ జీవితంలో భాగం చేసుకోవచ్చు.
జీర్ణవ్యవస్థపై ప్రభావం
భోజనం తర్వాత నడక వల్ల ఆహారం పేగుల్లో సులభంగా కదలడానికి సహాయం జరుగుతుంది. దీని వల్ల కడుపులో చిక్కుకుపోయిన గ్యాస్ బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండి ఉబ్బరం తగ్గుతుంది. అలాగే పేగుల కదలికలు మెరుగుపడి మల విసర్జన సులభమవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ అలవాటు కొంత ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారికి భోజనం తర్వాత చిన్న నడక శరీరానికి చలనం కలిగించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నడవాల్సిన విధానం
ఫార్ట్ వాక్స్ చేయాలంటే ముందుగా భోజనం పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపు ఆగాలి. ఆ తర్వాత నెమ్మదిగా, ఒత్తిడి లేకుండా నడవాలి. వేగంగా పరుగులు తీయడం లేదా గట్టిగా వ్యాయామం చేయడం మంచిది కాదు. రోజూ రాత్రి భోజనం తర్వాత ఇలా కొద్దిసేపు నడిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సాధారణంగా కనిపించే ఈ అలవాటు దీర్ఘకాలంలో మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు తరచూ ఎదురయ్యే వారు ఈ అలవాటును ప్రయత్నించవచ్చు. క్రమం తప్పకుండా పాటిస్తే శరీరంలో తేలికపాటి మార్పులు కనిపిస్తాయి. చిన్నపాటి నడకతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమే. కాబట్టి నేటి నుంచే ప్రతి భోజనం తర్వాత కొద్దిసేపు నడకను అలవాటు చేసుకోండి.
