పిల్లల మెదడు రహస్యం.. వీరి జ్ఞాపకశక్తి ఎలా పని చేస్తుందో తెలుసా..?

చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి ఉండదని అనుకునే వారి కోసం శాస్త్రవేత్తలు కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు. నాలుగు నెలల వయసున్న పసికందులకే కొన్ని విషయాలు గుర్తుండిపోతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు పిల్లల ఎదుగుదల, భాషా అభ్యాసం, భవిష్యత్తు మెదడు ఆరోగ్యం గురించి కొత్త దారులు చూపుతున్నాయి.

పిల్లల మెదడు రహస్యం.. వీరి జ్ఞాపకశక్తి ఎలా పని చేస్తుందో తెలుసా..?
Toddler Brain

Updated on: Sep 01, 2025 | 7:45 PM

సాధారణంగా చాలా మంది చిన్న పిల్లలకు జ్ఞాపకశక్తి ఉండదని అనుకుంటారు. కానీ కొత్త పరిశోధనలు దీనికి భిన్నంగా చెబుతున్నాయి. కేవలం నాలుగు నెలల వయసున్న పిల్లలకు కూడా కొన్ని విషయాలు గుర్తుంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల జ్ఞాపకశక్తి రహస్యం

యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నాలుగు నెలల నుంచి రెండేళ్ల వయసున్న 26 మంది పిల్లలపై ఈ పరిశోధన చేశారు. వారికి MRI స్కాన్ చేస్తున్నప్పుడు కొన్ని బొమ్మలు, వస్తువులను చూపించారు. కొద్దిసేపు ఆగి అంతకుముందు చూపించిన వాటికి దగ్గరగా ఉండే కొత్త బొమ్మలను మళ్లీ చూపించారు. అప్పుడు పిల్లలు మొదట చూసిన బొమ్మలపై ఎక్కువ సమయం దృష్టి పెట్టారు. అంటే వారికి వాటిని గుర్తుంచుకునే శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

మెదడులోని అద్భుతాలు

ఈ పరిశోధన ప్రకారం.. పిల్లల మెదడులో హిప్పోకాంపస్ అనే భాగం జ్ఞాపకాలను తయారు చేయడంలో చురుకుగా పనిచేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఈ సమయంలో ఏర్పడిన జ్ఞాపకాలను వారు పెద్దయ్యాక గుర్తు చేసుకోలేరని నిపుణులు చెబుతున్నారు.

బాల్యం నుండి వృద్ధాప్యం వరకు..

ఈ పరిశోధనల వల్ల పిల్లల భాష నేర్చుకునే విధానం, వారి ఎదుగుదల గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పెద్దవారిలో వచ్చే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యలను గుర్తించడానికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)