
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మనం చేసే పనులు మన రోజంతా ఎలా గడవబోతుందో నిర్ణయిస్తాయి. సాధారణంగా అందరూ ముందుకు నడవడానికి (Forward Walking) అలవాటు పడతారు. కానీ, కేవలం 30 సెకన్ల పాటు వెనక్కి నడిస్తే మీ మెదడు, శరీరంపై అద్భుతమైన సానుకూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ‘రెట్రో వాకింగ్’ అని కూడా పిలుస్తారు. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వెనక్కి నడవడం అనేది ఒక రొటీన్ ప్రక్రియ కాదు. కాబట్టి మెదడు ఈ కొత్త కదలికలను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇది మెదడుకు ఒక చిన్న వర్కవుట్ లాంటిది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఫోకస్ మెరుగవుతుంది, ఏదైనా విషయాన్ని వేగంగా గ్రహించే శక్తి పెరుగుతుంది.
వెనక్కి నడవడం అనేది ముందుకు నడవడం కంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. అలాగే, రోజంతా వంగి కూర్చునే వారికి, ఈ నడక వల్ల శరీరం నిటారుగా మారి సరైన ‘పోశ్చర్’ వస్తుంది.
“చిన్న అలవాటు – పెద్ద మార్పు” అనడానికి బ్యాక్‌వర్డ్ వాకింగ్ ఒక చక్కని ఉదాహరణ. రేపు ఉదయం మీరు నిద్రలేవగానే కేవలం 30 సెకన్ల పాటు వెనక్కి నడిచి చూడండి.. ఆ రోజంతా మీ మెదడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో మీకే అర్థమవుతుంది.