
సాధారణంగా పెద్దవాళ్లు రోజుకు 7-8 గంటలు నిద్ర పోవాలని అందరికీ తెలుసు. కానీ, మీరు అంత సేపు పడుకున్నా కూడా ఉదయం లేవగానే అలసటగా, నీరసంగా ఉంటే అది ఆశ్చర్యం కాదు. కేవలం గంటలు లెక్కపెట్టుకోవడం సరిపోదు. మీ నిద్ర క్వాలిటీ, రోజూ ఒకే టైంకి పడుకునే అలవాటు కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు.. మీరు ఒక రోజు రాత్రి 9 గంటలకు, మరో రోజు అర్ధరాత్రి 1 గంటకు పడుకుని 8 గంటల తర్వాత లేచినా సరే.. మీ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అనే సహజ గడియారం ఉంటుంది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఈ గడియారం మన నిద్ర, మేల్కొనే సమయాలు, హార్మోన్లు మరియు జీర్ణక్రియను కంట్రోల్ చేస్తుంది. మీరు రోజూ ఒకే టైంకి పడుకుంటే, ఈ గడియారం సరిగ్గా సెట్ అవుతుంది. అప్పుడు మీ శరీరం అంతా సవ్యంగా పనిచేస్తుంది.
మీరు రోజూ వేర్వేరు సమయాల్లో నిద్రపోతే, మీ శరీరంలో ఉన్న సహజ గడియారం దెబ్బతింటుంది. దీనివల్ల:
ఎక్కువ గంటలు పడుకున్నా, క్రమరహిత సమయాల్లో పడుకోవడం వల్ల గాఢ నిద్ర దెబ్బతింటుంది. గాఢ నిద్రలోనే మన శరీరం రిపేర్ అవుతుంది. అందుకే నిద్ర పూర్తయినా కూడా ఫ్రెష్‌గా ఉండలేరు.
నిద్ర టైం మారితే, నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. ఒత్తిడి హార్మోన్లు పెరిగి, జీవక్రియ నెమ్మదిస్తుంది.
క్రమరహిత నిద్ర వల్ల ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్లు చెడిపోతాయి. దీనివల్ల తరచుగా ఆకలి వేస్తుంది. ముఖ్యంగా స్వీట్లు తినాలనిపిస్తుంది. ఎక్కువ కాలం ఇదే జరిగితే, బరువు పెరగడం, షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిద్ర టైం స్థిరంగా లేకపోతే, బీపీ, గుండె కొట్టుకునే వేగంపై ప్రభావం పడి, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
నిద్ర సరిగ్గా లేకపోతే చిరాకు, ఆందోళన, నిరాశ వంటివి వస్తాయి. ముఖ్యంగా ఏకాగ్రత , జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.
మన ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. నిద్ర టైం మారితే, వ్యాధులతో పోరాడే శరీర శక్తి తగ్గిపోతుంది. తరచుగా జబ్బులు వస్తాయి.
కాబట్టి మీరు నిజంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే కేవలం 8 గంటలు పడుకుంటే సరిపోదు. రోజూ ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి మేల్కోవడం అనే మంచి అలవాటును ఇప్పుడే మొదలు పెట్టండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.