షార్ట్ స్లీపర్ సిండ్రోమ్.. ఇది వరమా లేక శాపమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

కొంతమందికి రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర అవసరం లేకుండా.. 4 నుండి 6 గంటలు నిద్రపోయినా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇది చూసి చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. దీన్ని షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ (SSS) అని పిలుస్తారు.

షార్ట్ స్లీపర్ సిండ్రోమ్.. ఇది వరమా లేక శాపమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Working

Updated on: Jul 20, 2025 | 8:37 PM

కొంత మందికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం లేకుండానే.. 4 నుంచి 6 గంటలు నిద్రపోతే చాలు. వీళ్లు ఏ అలసట లేకుండా పూర్తి చైతన్యంతో రోజు మొదలుపెడతారు. ఈ అరుదైన పరిస్థితినే షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ (SSS) అంటారు. ఈ స్థితిలో ఉన్నవాళ్లు పగలంతా నిద్రపోవాల్సిన అవసరం లేకుండా చురుకుగా ఉంటారు. ఇది జీవనశైలి వల్ల కాదు. వాళ్ల శరీర వ్యవస్థే సహజంగా అలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ (SSS)

షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ చాలా అరుదుగా కనిపించే శారీరక లక్షణం. అయితే ఈ పరిస్థితి ఉన్నవాళ్ల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలీదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిద్ర అవసరం వేరు. జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై నిద్ర ఆధారపడి ఉంటుంది. కేవలం తక్కువ గంటలు నిద్రపోవడం షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ కాదు. రోజూ అతి తక్కువ నిద్రతో శక్తివంతంగా ఉండగలిగితేనే అది నిజమైన షార్ట్ స్లీపర్ లక్షణం.

ఎలా వస్తుంది..? అసలు కారణమేంటి..?

దీని వెనుక ఉన్న కారణం ఇంకా పూర్తిగా తెలియదు. అయితే పరిశోధనల ప్రకారం జన్యు మార్పులే దీనికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ నిద్రపోయే కొంతమందిలో DEC2 అనే జన్యువులో ఒక మార్పును గుర్తించారు. ఈ జన్యువు మన శరీరంలోని జీవగడియారాన్ని (biological clock) ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నారు. ఈ జీవగడియారం నిద్రను నియంత్రిస్తుంది.

వీరిలో కనిపించే లక్షణాలు

  • ప్రతి రోజు 6 గంటలకంటే తక్కువ నిద్ర
  • పగలు నిద్ర లేకుండా చురుకుదనం
  • శక్తి స్థాయి స్థిరంగా ఉండటం
  • పనులపై దృష్టి పెట్టగల సామర్థ్యం
  • నిద్ర పట్టని ప్రభావం పనితీరు మీద లేకపోవడం
  • SSS ఉన్నవాళ్లు రోజుకు తక్కువ నిద్రపోయినా అలసట లేకుండా.. బాగా విశ్రాంతి పొందినట్లు అనిపిస్తుంది.

SSS వల్ల కలిగే ప్రభావాలు

  • ఈ స్థితి ఉన్నవాళ్లు ఎక్కువ సమయం ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే దీని వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా రావచ్చు.
  • నిద్రలేమి సమస్య.. నిద్ర సరిపోయిందని మీకు అనిపించినా.. మీ శరీరానికి నిజంగా కావాల్సినంత విశ్రాంతి దొరకకపోవచ్చు. ఇది బయటికి కనిపించని నిద్రలేమి సమస్య.
  • వ్యక్తిగత జీవితంలో మార్పులు.. షార్ట్ స్లీపర్స్ మిగతావాళ్లకంటే ముందు లేస్తారు కాబట్టి కుటుంబ సభ్యుల షెడ్యూల్‌ కు ఇబ్బంది కలగవచ్చు.
  • ఆరోగ్యపరమైన దీర్ఘకాలిక సమస్యలు.. సరైన నిద్ర లేకపోవడం గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, రోగ నిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

షార్ట్ స్లీపర్ సిండ్రోమ్ ఒక ప్రత్యేకమైన శరీర లక్షణం. దీని వల్ల కొంత మంది తక్కువ నిద్రతో ఎక్కువ పనులు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలు ఇంకా పరిశోధనలోనే ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రభావాల దృష్ట్యా, ఇది చిన్నగా కనిపించినా.. జాగ్రత్తగా గమనించాల్సిన విషయమే.

మీరు తక్కువ గంటలు నిద్రపోయి రోజంతా అలసట లేకుండా ఉంటే.. అది సాధారణమేనా లేదా SSS లాంటిదా అని తెలుసుకోవాలంటే నిపుణుడిని సంప్రదించడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)