
ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం లాంటి క్రమంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా మంది ప్రోటీన్ లోపాలను భర్తీ చేయడానికి పనీర్‌ను ఎక్కువగా తమ ఆహారంలో తీసుకుంటున్నారు. ఇది శరీరాన్ని బలోపేతం చేయడంతోపాటు కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అందుకే పనీర్‌ను ఎక్కువగా తింటారు. అదే సమయంలో మరో ఆహార పదార్థం చీజ్‌ను మాత్రం పక్కన పెడుతుంటారు. అయితే, పన్నీర్ కంటే చీజ్ మంచిదా? కాదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు పోషకాహార నిపుణులు మాత్రం పనీర్ కంటే చీజ్ మంచిదని అంటున్నారు. ఎందుకిలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండింటిపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభం వాట్స్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, పన్నీర్ కంటే జున్ను మంచిదని ఆయన అనేక వాస్తవాలతో వివరించారు. బ్రాండ్లు జున్నును సరిగ్గా మార్కెట్ చేయకపోవడమే డిమాండ్ లేకపోవడానికి కారణమని అన్నారు. అందుకే ప్రజలు దీనిని అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. దీనిని ఫాస్ట్ ఫుడ్‌లో మాత్రమే ఉపయోగిస్తారు.
చాలా మంది పనీర్‌ను ప్రోటీన్ యొక్క ఉత్తమ వనరుగా భావిస్తారు. శాఖాహారులు తమ ప్రోటీన్ లోపాన్ని తీర్చుకోవడానికి పనీర్‌ను తీసుకుంటారు. అయితే, చాలా మంది జున్ను తినరు. కానీ డాక్టర్ శుభమ్ వాట్స్ ప్రకారం.. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుండగా.. 100 గ్రాముల ప్రాసెస్ చేయని జున్ను నుంచి మీరు 25 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. దీంతో పాటు కేలరీల పరంగా.. 100 గ్రాముల జున్నులో 400 కేలరీలు ఉండగా.. పనీర్‌లో మాత్రం 250 కేలరీలు ఉంటాయి. జున్నులో ఫ్యాట్ 33 గ్రాములు, పనీర్‌లో 20 గ్రాములు ఉంటాయి.
పనీర్ కంటే జున్నులో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది కొవ్వు, కేలరీలు కూడా ఎక్కువ కలిగి ఉంది. అందువల్ల, మీ శరీర అవసరాల ఆధారంగా మీరు మీ ఆహారంలో పనీర్, చీజ్‌ను చేర్చుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే.. పనీర్ ఉత్తమమని డాక్టర్ శుభం వాట్స్ చెబుతున్నారు. అయితే, మీరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటే.. మీ ఆహారంలో చీజ్/జున్ను చేర్చుకోవడం ఇంకా మంచిదని స్పష్టం చేస్తున్నారు.