చాలా మంది మహిళలకు పిల్లలు పుట్టడం లేదని బాధపడుతుంటారు. అత్తింటి వారు, ఇరుగు పొరుగు వారితో మాటలు పడాల్సి వస్తుందని మనోవేదనకు గురవుతారు. మహిళలకు పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా అండాశయ సమస్యలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అండాశయాలు అనేవి స్త్రీ పునురుత్పత్తి వ్యవస్థలో భాగం. అవి ఆడవారి పెల్విస్ లో ఉంటాయి. ముఖ్యంగా గుడ్డు కణాలను పట్టుకోవడం, అలాగే హార్మోన్లు తయారు చేయడంలో ఉపయోగపడతాయి. అయితే అండశయం మీద ద్రవంతో కూడిన అండాశయ తిత్తులు ఏర్పడడం సర్వసాధారణం. ఈ తిత్తులు మహిళలకు సాధారణంగా ఎలాంటి ఇబ్బందులూ కలుగజేయవు. కొన్ని తిత్తులు ఎలాంటి చికిత్సా లేకుండా వాటంతట అవే తొలగిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం చాలా ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా అండాశయ తిత్తుల సైజు బట్టి ఇబ్బందులు పెరుగుతాయి.
పెద్ద అండాశయ తిత్తుల వల్ల భరించలేని కటి నొప్పి, వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి అవి చీలిపోయి కటి లోపల రక్తస్రావానికి దారితీయవచ్చు. అలాగే పొత్తికడుపు వాపు, బాధాకరమైన సెక్స్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. అలాగే హార్మోన్ల సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు తెలిసిన స్త్రీలు అండాశయ తిత్తులతో గుర్తించబడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా, పెల్విక్ ఇన్ఫెక్షన్లు, గర్భధారణ సమస్యలు వంటి సమస్యలతో బాధపడతారు. కొన్నిఅండాశయ తిత్తులు కడుపు నొప్పి, ఉబ్బరం, సక్రమం కాని రుతుక్రమం వంటి అసహ్యకరమైన లక్షణాలను కలిగిస్తాయి. రుతుస్రావం ఆలస్యం, రుతుస్రావం లేకపోవడం వంటి సమస్యలతో పాటు ప్రేగులలో ఆటంకాలు కూడా కలగవచ్చు. సిస్ట్‌లను సరైన సమయంలో నిర్వహించకపోతే అండాశయాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలున్న స్త్రీ వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సోనోగ్రఫీ అండాశయ తిత్తుల సమస్యను నిర్ధారించడంలో సాయపడుతుంది. అలాగే అల్ట్రా సౌండ్ స్కానింగ్ తో కూడా తిత్తులను గుర్తించే అవకాశం ఉంది. టెస్టుల అనంతరం డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి చికిత్సను ప్రారంభిస్తారు. ముఖ్యంగా గైనకాలిజిస్ట్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చేలా కృషి చేస్తారు. కాబట్టి తరచూ వైద్యుల సలహాలను పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..