Covid 19: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఇప్పటికీ తగ్గడం లేదు. దాని లక్షణాలు దీర్ఘకాలం ఉంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలే సమస్యను కూడా పెంచుతుంది. UKలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడి కోలుకున్న రెండు మిలియన్ల మంది ప్రజల్లో ఇప్పటికీ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్‌లో అలసట, శ్వాస ఆడకపోవడం, ఎక్కువగా పని చేయలేపోవడం వంటి లక్షణాలు మాత్రమే కనిపించేవి. అయితే, తాజా అధ్యయనం ప్రకారం, లాంగ్ కోవిడ్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలింది.
ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడి కోలుకున్న 11 వారాల తర్వాత కూడా దాని లక్షణాలు కొనసాగాయి. వీటిలో జుట్టు రాలడం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, ఛాతీ నొప్పి, జ్వరం, జీర్ణ సమస్యలు, శరీరంలోని కొన్ని భాగాలలో వాపు, పురుషులలో వంధ్యత్వం కూడా ఉన్నాయి. వంధ్యత్వం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది.
లాంగ్ కోవిడ్ అంటే ఏంటి?
లాంగ్ కోవిడ్ అంటే.. రిపోర్టు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు ఎక్కువ కాలం వ్యక్తులలో కనిపిస్తాయి. కోవిడ్ తర్వాత చాలా నెలల వరకు ఇది కొనసాగుతుంది. అయితే, ఈ లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయని చెప్పలేం.
అధ్యయన నివేదిక ఏం చెబుతోంది..
నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో లాంగ్ కోవిడ్‌లో 62 లక్షణాలను గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా జనవరి 2020 నుండి ఏప్రిల్ 2021 వరకు ఇంగ్లాండ్‌లో కోవిడ్ 19 బారిన పడిన 450,000 మందికి పైగా ఎలక్ట్రానిక్ ప్రైమరీ కేర్ రికార్డులు విశ్లేషించారు. అదే సమయంలో కోవిడ్ సోకని 19 లక్షల మందిని కూడా విశ్లేషించారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు 115 లక్షణాలను వివరించారు. వాటిలో 62 లక్షణాలు సాధారణంగా కనిపించాయి.
దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి కొన్ని లక్షణాలు ఇప్పటికీ సంభవించే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా తాజా అధ్యయనంలో వెల్లడైంది. జుట్టు రాలడం, ఛాతీ నొప్పి, జ్వరం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, జీర్ణ సమస్యలు, శరీరంలోని కొన్ని భాగాలలో వాపు, నపుంసకత్వం వంటివి ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..