మీ పిల్లలు రాత్రిపూట కాళ్ల నొప్పులతో ఏడుస్తున్నారా..? దీనికి కారణాలేంటో తెలుసా..?
పిల్లలు రాత్రిపూట కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడడం చూసి చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడతారు. ఎక్కువ సందర్భాల్లో ఇవి గ్రోయింగ్ పెయిన్స్ అనుకుని లైట్ తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఇది అంతకు మించిన పెద్ద సమస్యకు సైన్ కావచ్చు. ఏ సమయంలో దీనిని లైట్ తీసుకోవాలి.. ఎప్పుడు డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాల్లో.. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.

పిల్లలు రాత్రిపూట కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడడం చూసి చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడతారు. రోజంతా ఆడుకుని, అలిసిపోయారు అనుకుని కాసేపు మసాజ్ చేసి వదిలేస్తారు. పిల్లలు కూడా వెంటనే రిలీఫ్ పొంది మరుసటి రోజు మామూలుగా ఉంటారు. ఇలాంటి నొప్పులను మనం సాధారణంగా గ్రోయింగ్ పెయిన్స్ అని అనుకుంటూ ఉంటాం. చాలా వరకు ఇది నిజమే అయినా కొన్నిసార్లు అది వేరే పెద్ద సమస్యకు సైన్ కావచ్చు. అందుకే ప్రతీసారి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు.
గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటి..?
పిల్లలు త్వరగా పెరిగే దశలో ఉన్నప్పుడు కండరాలు, ఎముకలు పెరగడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తుంటాయి. ఇవి ఎక్కువగా తొడలు, పిక్కల్లో, రాత్రిపూట కనిపిస్తాయి. కొన్నిసార్లు రెండు కాళ్ళలో ఒకేసారి నొప్పి రావడం కామన్. మసాజ్ చేస్తే, గోరువెచ్చని నీటితో కాపడం పెడితే లేదా రెస్ట్ తీసుకుంటే వెంటనే నొప్పి తగ్గుతుంది. ఇవి సాధారణంగా ఒక రోజులోనే తగ్గిపోతాయి. ఇలాంటి నొప్పులకి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఎప్పుడు డాక్టర్ ని కలవాలి..?
కొన్నిసార్లు కాళ్ళ నొప్పికి కారణం వేరే ఉండవచ్చు. కింది లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే మాత్రం డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం.
- నిరంతరంగా అలసిపోవడం, బరువు తగ్గడం.
- నొప్పి రోజంతా ఉండడం, ఒక రోజులో తగ్గకపోవడం.
- కీళ్ళలో వాపు కనిపించడం.
- రెండు కాళ్ళలో కాకుండా ఒకే కాలులో నొప్పి ఉండడం.
- పిల్లలు ఆడుకోవడానికి లేదా రోజూ చేసే పనులు చేయడానికి ఆసక్తి చూపకపోవడం.
- నొప్పికి కారణం ఏదైనా దెబ్బ తగలడం లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత రావడం.
- ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్టులు, ఎక్స్ రేలు లేదా MRI చేయించవచ్చు.
కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పిల్లల్లో కాళ్ళ నొప్పులకు కారణం కావచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- విటమిన్ D లోపం.. ఈ లోపం వల్ల వెన్ను, చేతుల్లో కూడా నొప్పి రావచ్చు. టెస్ట్ చేయించి డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి.
- పోస్ట్ వైరల్ జాయింట్ పెయిన్.. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కీళ్ళలో వాపు, నొప్పి కనిపించవచ్చు.
- గాయం లేదా ఇన్ఫెక్షన్.. ఎముకల్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే అది సాధారణంగా స్కాన్‌ల లోనే తెలుస్తుంది.
- ఇతర ఇన్ఫ్లమేటరీ వ్యాధులు.. ఉదయం పూట ఎక్కువగా నొప్పి ఉండి.. రోజంతా తగ్గిపోతే అది కీళ్ళ సమస్యలకు సంకేతం కావచ్చు.
- లుకేమియా (బ్లెడ్ క్యాన్సర్).. ఇది చాలా అరుదుగా వస్తుంది. కానీ నిరంతర ఎముక నొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
మానసిక ఆరోగ్యం
పిల్లల్లో వచ్చే అన్ని నొప్పులకు శారీరక కారణాలే ఉండాలని లేదు. ఒత్తిడి, ఆందోళన లేదా ఒంటరితనం లాంటి సమస్యలు కూడా శారీరక నొప్పుల రూపంలో బయటపడవచ్చు. స్కూల్‌కి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం, ఆడుకోవడం తగ్గించడం లేదా కారణం లేకుండా నొప్పులు చెప్పడం లాంటివి కనిపిస్తే వారి మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అందుకే పిల్లలతో ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడాలి వాళ్ల కష్టాలను పంచుకునే వాతావరణం క్రియేట్ చేయాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




