
డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు చాలా ప్రత్యేకమైనది. దీనికి బోలెడంత రుచి ఉంటుంది. చాలా వంటకాల్లో దీన్ని వాడతారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని చాలా ఇష్టపడతారు. జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రోజూ ఎంత తినాలో, ఎన్ని తింటే శరీరానికి మంచి జరుగుతుందో చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇతర నట్స్ తో పోలిస్తే జీడిపప్పుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హల్వా, పాయసం, స్వీట్స్, బిర్యానీ, పులావ్ లాంటి వాటిలో దీన్ని తరచూ వాడుతాం. అయితే దీన్ని ఎక్కువగా తినడం మంచిదేనా..? ఎంత తినాలి..? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి.
నిజం చెప్పాలంటే జీడిపప్పులో మంచి కొవ్వులు ఉంటాయి. అంతే కాదు దీని ద్వారా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్ B2, జింక్, ఫైబర్ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ శక్తినిచ్చేవి కావడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హానికరంగా మారే అవకాశమూ ఉంది. సరైన మోతాదులో తీసుకుంటేనే ఉపయోగపడుతుంది. సాధారణంగా రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తినడమే సరిపోతుంది. కొవ్వులు ప్రోటీన్ ఎక్కువ అవసరమైన వాళ్ళు 15 నుంచి 30 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ బరువు పెరుగుతారనే ఆలోచన ఉంటే డైటీషియన్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి.
కొంతమంది రోజుకు 30కి పైగా జీడిపప్పులు తింటుంటారు. కానీ అంతగా తినడం అందరికీ మంచిది కాదు. మీరు ఆటలలో పాల్గొనేవారైనా.. బాడీ బిల్డర్ అయినా.. జీడిపప్పులు అధికంగా తినేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల శరీరంలో మెటబాలిజం వేగంగా జరుగుతుంది.
అంటే వాళ్ల శరీరం తిన్న ఆహారాన్ని త్వరగా శక్తిగా మార్చేస్తుంది. దాంతో వారు ఎక్కువ శక్తిని తక్కువ సమయంలో ఖర్చు చేయగలుగుతారు. కానీ సాధారణ జీవనశైలిలో ఉన్నవారు అంత శక్తిని ఖర్చు చేయలేరు కాబట్టి ఎక్కువ జీడిపప్పులు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కానీ సాధారణ జీవనశైలిలో ఉన్నవారు ఎక్కువగా జీడిపప్పు తింటే బరువు పెరగడం మొదలవుతుంది. ఇందులో ఎక్కువగా కొవ్వులు, క్యాలరీలు ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఒత్తిడి, అలర్జీలు, కడుపునొప్పులు, వాంతులు, అలసట, వాపులు లాంటి సమస్యలు రావొచ్చు.
అందుకే జీడిపప్పు తినేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని చూసి.. సరైన పరిమితిలోనే తీసుకోవడం మంచిది. మితంగా తీసుకుంటేనే జీడిపప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)