
మారుతున్న వాతావరణం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో వాతావరణం తరచుగా వేడిగా, కొన్నిసార్లు అకస్మాత్తుగా వర్షాలు పడటంతో రోగనిరోధక శక్తి బలహీనపడి, త్వరగా అనారోగ్యానికి గురవుతున్నాం. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసి, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనివల్ల జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను సమర్థవంతంగా తగ్గించుకునేందుకు కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
అల్లం: ఇది వాయుమార్గాల్లో వాపును తగ్గించి, కఫం పలుచబడటానికి సహాయపడుతుంది.
పసుపు: దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తేనె: తేనె సహజ కఫహర గుణాలను కలిగి ఉంటుంది.
వెల్లుల్లి: ఇది శ్వాసకోశాన్ని శుభ్రం చేసే శక్తిని కలిగి ఉంది. మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.
గోరువెచ్చని నీటిలో తేనె, చిటికెడు నల్ల మిరియాల పొడి, కొద్దిగా ఏలకుల పొడి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫం పలుచబడుతుంది. రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు దీనిని తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం తగ్గుతుంది.
ఆవిరి పీల్చడం వల్ల వాయునాళాలు తేమగా మారతాయి. దీంతో కఫం సులభంగా బయటకు వస్తుంది. వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె కలిపి ఆవిరి పీల్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పుదీనా, సేజ్ లాంటి మూలికలతో తయారుచేసిన టీ కఫం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అవి శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తాయి.
ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కఫం బయటకు పంపడం సులభం అవుతుంది. నడక, లోతైన శ్వాస వ్యాయామాలు శ్వాసకోశ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
తరచుగా వేడి పానీయాలు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫం పలుచబడి, తొలగిపోతుంది. తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కఫం సమస్య తగ్గుతుంది.
కొవ్వు, చక్కెర, చల్లని ఆహార పదార్థాల తీసుకోవడం తగ్గించండి. శ్వాసకోశ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయండి.
మీ ఇంట్లో తేమ స్థాయిని సమతుల్యంగా ఉంచుకోండి. పరిశుభ్రతను పాటించండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కఫం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం.
గమనిక: ఈ నివేదికలో అందించిన ఆరోగ్య సమాచారం, సలహాలు మీ సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారాన్ని శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సలహాల ఆధారంగా అందిస్తున్నాం. ఏదైనా పద్ధతి లేదా విధానాన్ని అనుసరించే ముందు, మీరు దాని గురించి వివరంగా తెలుసుకోవాలి. మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.