
మహిళలను ఎక్కువగా వేధించే సమస్య పీరియడ్స్ నొప్పి. ప్రతి నెలా ఎంతో మంది మహిళలు ఈ నొప్పితో అల్లాడిపోతుంటారు. పీరియడ్స్ టైమ్‌లో కడుపు నొప్పి, నడుం నొప్పి, చిరాకు ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు చేసే పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతారు. మరికొంత మంది మహిళలు నొప్పి కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ట్యాబ్లెట్స్‌తో కొన్ని గంటలు నొప్పి తగ్గినా.. అది మళ్లీ వేధిస్తూనే ఉంటుంది. మరికొంత మంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ట్యాబ్లెట్స్‌తో పనిలేకుండా హాయిగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పీరియడ్స్ టైమ్‌లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. ఇది క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, ఇతర అసౌకర్యాలకు దారితీయవచ్చు. అందుకే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు.. ముఖ్యంగా పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బాదం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి నొప్పిని కంట్రోల్ చేయడంతో పాటు ఆకలిని తగ్గిస్తుందని చెప్పారు. సాయంత్రం స్నాక్స్‌గా నూనె పదార్థాలు కాకుండా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలని సూచిస్తున్నారు. మెగ్నీషియం ఎక్కువగా ఉండే విత్తనాలు, డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల రిలీఫ్‌ను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పీరియడ్స్‌లో వచ్చే నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి ఎస్సెన్షియల్ ఆయిల్స్ బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లావెండర్, రోజ్‌మేరీ, పెప్పర్‌మెంట్ వంటి అత్యవసర నూనెలతో మసాజ్ చేసుకుంటే నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుందని సూచిస్తున్నారు.
పీరియడ్స్ టైమ్‌లో నీళ్లు ఎక్కువగా తాగాలని.. గోరువెచ్చని నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నీరు తాగితే శరీరంలో నొప్పి ఉన్న కండరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని.. దాంతో నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. అదేవిధంగా నీరు అధికంగా ఉండే పుచ్చకాయ, కీరదోస వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు మూడ్ స్వింగ్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటే ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ట్యాబ్లెట్స్ కాకుండా హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్ల బాటిల్‌తో కాపుకుంటే నొప్పి తగ్గుతుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మనసు కొంచెం తేలిక పడుతుందని చెప్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..