
మీరు గమనించాల్సిన ముఖ్యమైన లక్షణాల్లో మొదటిది కళ్ల చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు. వీటిని తరచుగా అలసట లేదా నిద్రలేమికి సూచనలుగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది కాలేయానికి సంబంధించిన సమస్యకు కూడా ఒక సంకేతం కావచ్చు. కాలేయంపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఆ ఒత్తిడిని ఇలా ముఖం ద్వారా చూపించవచ్చు.
మీ చర్మం ముఖ్యంగా కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం గమనిస్తే అది కామెర్లు లేదా లివర్ సంబంధిత సమస్యల ప్రారంభ సూచన కావచ్చు. ఇది శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం స్థాయి అధికంగా ఉందనే సంకేతం. ఇది కాలేయం సరిగ్గా పని చేయడం లేదని తెలియజేస్తుంది.
కాలేయం సమర్థంగా పనిచేయకపోతే శరీరంలోని విష పదార్థాలు పూర్తిగా బయటకు వెళ్లవు. ఫలితంగా అవి రక్తంలో కలిసిపోయి ముఖం చుట్టూ వాపుగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ్ళ కింద, బుగ్గల ప్రాంతంలో ఈ వాపు స్పష్టంగా కనిపించవచ్చు.
రక్తంలో విష వ్యర్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ చర్మం తన సహజమైన మెరుపును కోల్పోతుంది. ముఖం తెల్లగా జీవం లేనట్లుగా మారిపోవచ్చు. ఇది కాలేయం బాగా పని చేయట్లేదనే మరో సంకేతం. లివర్ పని తీరు మందగించినప్పుడు శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇవి ముఖంపై ప్రభావం చూపుతాయి.
కాలేయానికి ఎక్కువ పని భారం పడటం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ముఖ చర్మంపై పిగ్మెంటేషన్, మొటిమలు, వాపులు వంటి సమస్యల రూపంలో కనిపించవచ్చు. ముఖ్యంగా హార్మోన్ల నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మొదలవ్వవచ్చు.
ఈ విధంగా ముఖంపై కనిపించే కొన్ని చిన్న మార్పులు కూడా శరీరంలో లోపల జరుగుతున్న పెద్ద సమస్యలను సూచించవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యను ప్రారంభ దశలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు. కాబట్టి మీరు ఈ లక్షణాలను గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.