యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గుండెపోటు వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గౌట్‌, కిడ్నీ రాళ్లు, కీళ్ల నొప్పి, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు, దాని వల్ల కలిగే ప్రమాదాలు, జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గుండెపోటు వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Uric Acid

Updated on: Aug 19, 2025 | 8:25 PM

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా దీని వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది మన కీళ్ళలో చేరి గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాల గురించి.. అలాగే యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ పెరిగితే ఏం జరుగుతుంది..?

యూరిక్ యాసిడ్ అనేది శరీరం ప్యూరిన్‌ లను విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా ఇది మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. కానీ దీని ఉత్పత్తి పెరిగినప్పుడు లేదా శరీరం దాన్ని సరిగ్గా బయటకు పంపలేనప్పుడు అది రక్తంలో పేరుకుపోతుంది.

  • కీళ్లలో నొప్పి.. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది సూదులలాంటి చిన్న స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీని వల్ల తీవ్రమైన నొప్పి, వాపు వస్తుంది. ఈ పరిస్థితిని గౌట్ అంటారు. ముఖ్యంగా కాలి బొటన వేలులో నొప్పి, వాపు ఎక్కువగా కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ స్ఫటికాలు కీళ్లను శాశ్వతంగా దెబ్బతీస్తాయి.
  • గుండె సమస్యలు.. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అది రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే రిస్క్‌ ను పెంచుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం, అసాధారణ గుండె వేగం (irregular heartbeat) వంటి వాటికి కూడా కారణం కావచ్చు.
  • కిడ్నీలో రాళ్లు.. అధిక యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్ర నాళాల్లో అడ్డుపడి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు దారితీస్తుంది.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే శరీరంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు.

  • కీళ్ల నొప్పి.. ముఖ్యంగా బొటనవేలిలో తీవ్రమైన నొప్పి, వాపు, ఎర్రబారడం. ఇది సాధారణంగా రాత్రిపూట మొదలై ఉదయం వరకు తీవ్రంగా ఉంటుంది.
  • నడవడంలో ఇబ్బంది.. కీళ్లలో నొప్పి వల్ల నడవడం, నిలబడటం కష్టం అవుతుంది.
  • నడుము నొప్పి.. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నడుము భాగంలో కూడా నొప్పి వస్తుంది.
  • కాళ్లలో మంట, తిమ్మిరి.. పాదాల కింద, కాలి వేళ్లలో మంట, వాపు, తిమ్మిరి వంటివి కూడా యూరిక్ యాసిడ్ పెరిగిందనడానికి సంకేతాలు కావచ్చు.

ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. సరైన చికిత్స, ఆహారపు అలవాట్ల మార్పుతో ఈ సమస్యను నియంత్రించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)