
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, ఈ ఒత్తిడి కలిగినప్పుడు మన శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనిని సాధారణంగా ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో శరీరం స్పందించడానికి ఇది అవసరమే అయినప్పటికీ, దీర్ఘకాలం పాటు ఈ హార్మోన్ స్థాయిలు రక్తంలో ఎక్కువగా ఉంటే అది ఒక నిశ్శబ్ద హంతకిలా మారుతుంది. మీ శరీరంలో మీకు తెలియకుండానే కొన్ని మార్పులు వస్తున్నాయంటే, అది కార్టిసాల్ పెరుగుదలకు సంకేతం కావచ్చు. శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరిగిందని ఎలా తెలుస్తుంది?
కార్టిసాల్ పెరిగినప్పుడు అది శరీర మెటబాలిజంపై దాడి చేస్తుంది. దీనివల్ల ఎంత తక్కువ తిన్నా, ఎంత వ్యాయామం చేసినా బరువు పెరుగుతూనే ఉంటారు. ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీనిని వైద్యపరిభాషలో ‘స్ట్రెస్ బెల్లీ’ అంటారు. అలాగే ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా, కార్టిసాల్ ప్రభావం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. రాత్రిపూట ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోవడం, ఉదయాన్నే లేవగానే తీవ్రమైన నీరసం, అలసటగా అనిపించడం దీని ప్రధాన లక్షణం. చర్మంపై ముడతలు రావడం, గాయాలు త్వరగా మానకపోవడం కూడా కార్టిసాల్ అధికంగా ఉందనడానికి లక్షణాలు.
కార్టిసాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలను తగ్గించి, గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలను ఎంచుకోవాలి. మెగ్నీషియం, విటమిన్-బి పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం.. ప్రతిరోజూ రాత్రి కనీసం 8 గంటల గాఢ నిద్ర. మనసును ఉల్లాసంగా ఉంచుకునేందుకు మనసుకు ఇష్టమైన హాబీలను అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.