ఈ జన్మమే రుచి చూడటానికి వేదికరా.. అనే పాట విన్నారుగా.. అవును నిజంగానే కొన్ని రకాల ఐటెమ్స్ ని మనం ఎప్పుడూ టేస్ట్ చేయము. కానీ వాటిని కూడా మన స్టైల్లో మార్చుకుని చేస్తే అద్భుతం అంతే. ఉలవచారు గురించి అందరికీ తెలుసు. వేడి వేడి అన్నంలో అలా ఉలవచారు వేసుకుని.. అప్పడాలతో తింటే.. ఇక నోట్లోనుంచి మాట రాదు. అలాగే ఉలవచారు-బిర్యానీ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. దీన్ని చాలా మంది హోటల్స్ లో ట్రై చేసే ఉంటారు. మన ఆరోగ్యానికి ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.
శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉలవల్లో ఉంటాయి. కనీసం పది రోజులకు ఓ సారైనా ఉలవలను తింటే శరీరం బలంగా.. ధృఢంగా ఉంటుంది. ప్రోటీన్ లోపం ఉన్నవారు ఉలవలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. పాత కాలంలో ఉలవచారును బాగా తినేవారు. రానురాను ఉలవచారును చేయడం తగ్గించేసారు. పల్లెటూర్లలో ఇప్పటికీ దీన్ని చేస్తారనుకోండి. ఇప్పుడు ఈ ఉలవచారుతో కేవలం చారు మాత్రమే కాదు.. కోడిగుడ్డు పులుసు కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా.. వెరైటీగా ఉంటుంది. చెబుతూంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా.. మరింకెందుకు ఆలస్యం.. ఉలవల కోడిగుడ్డు పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవచారు కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు:
ఉలవలు-ఒక గ్లాస్, ఉడికించిన కోడిగుడ్లు-5, చింతపండు – నిమ్మకాయంత, నూనె- సరిపడినంత, ఉప్పు, కారం, మసాలాలు – సరిపడినంత, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – రెండు, ఇంగువ – చిటికెడు, కరివేపాకు- ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా, పచ్చి మిర్చి – 5, ఉల్లిపాయలు – పెద్దవి రెండు, బటర్ లేదా నెయ్యి- కొద్దిగా.
ఉలవచారు కోడిగుడ్డు పులుసు తయారీ విధానం:
ఈ కర్రీ చేయాలంటే ముందు రోజు రాత్రే గ్లాస్ ఉలవలను కడిగేసుకుని, నాన బెట్టుకోవాలి. ఉదయం వాటిని కుక్కర్ లో వేసి, 5, 6 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఈ ఉలవలను మెత్తగా చేసుకుని వడకట్టాలి. ఉలవలు ఉడికించిన నీటిలో చింతపండు రసం వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. నెక్ట్స్ కడాయిలో నూనె వేసి.. ఉడికించిన గుడ్లను వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
నెక్ట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఇవి వేగాక కారం, ఉప్ప, పసుపు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక.. ముందుగా పక్కకు పెట్టుకున్న ఉలవలు-చింతపండు రసాన్ని వేసుకుని బాగా మరిగించాలి. పులుసు కాస్త దగ్గర పడుతుంది అనే సమయంలో కోడి గుడ్లు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత బటర్ లేదా నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి. నెక్ట్స్ కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఉలవచారు-కోడిగుడ్డు పులుసు రెడీ. దీన్ని అన్నంతో అయినా చపాతీతో అయినా తింటే రుచిగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి