Telugu News Health Gripe Water for Babies Safe or Dangerous Why Doctors Say No to Gripe Water for Infants
గ్రైప్ వాటర్ పిల్లలకు సురక్షితమేనా..? డాక్టర్ ఎందుకు వాడకూడదంటున్నారు..? తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!
చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ గ్రైప్ వాటర్ ను నమ్మకంతో వాడుతుంటారు. బేబీల్లో కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా..? ఇది పిల్లల ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశాలు ఎక్కువట. ఇంకా ఏం చెబుతున్నారంటే..
పిల్లల డాక్టర్ కారుణ్య చెప్పినదాని ప్రకారం.. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ గ్రైప్ వాటర్ ను పిల్లల కోసం సురక్షితమైన చిట్కాగా భావిస్తున్నారు. కడుపు నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ నిజానికి ఇది వైద్యపరంగా నిరూపించబడని పరిష్కారం.
గ్రైప్ వాటర్ వల్ల కలిగే సమస్యలు
సైంటిఫిక్‌గా ప్రూవ్ అవ్వలేదు.. ఈరోజు వరకు గ్రైప్ వాటర్ పిల్లల సమస్యలను తగ్గిస్తుందని ఏ సైంటిఫిక్ పరిశోధన కూడా నిరూపించలేదు.
హానికరమైన పదార్థాలు ఉండే అవకాశం.. మార్కెట్లో దొరికే కొన్ని బ్రాండ్లలో ఆల్కహాల్, షుగర్, కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ ఉండవచ్చు. ఇవి పసిపిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
పాల పోషణపై ప్రభావం.. గ్రైప్ వాటర్ తాగిన పిల్లలు పాలు తాగడం తగ్గించవచ్చు. దీని వల్ల సరైన పోషకాలు అందక పిల్లల కడుపు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
పరిష్కారాలు ఏంటి..?
తరచూ త్రేన్పులు (బర్పింగ్) తీయించడం.. ప్రతిసారి పాలు పట్టించిన తర్వాత పిల్లల్ని భుజంపై వేసుకుని నెమ్మదిగా వెన్నుపై నిమిరితే కడుపులో గ్యాస్ పోతుంది.
సరైన పాలు పట్టే పద్ధతులు.. పిల్లల తలను కొంచెం పైకి ఉంచి పాలు పట్టించడం వల్ల పాలు సులభంగా జీర్ణమవుతాయి.
డాక్టర్ సలహా తీసుకోవడం.. పిల్లలకు పదే పదే కడుపు సమస్యలు వస్తే సొంత వైద్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
గ్రైప్ వాటర్ వాడకాన్ని ఆపడం ఒక చిన్న నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ అది మీ బిడ్డ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాత పద్ధతులు లేదా సాధారణ నమ్మకాలు కంటే.. డాక్టర్ సూచనలు పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం.
మీ బిడ్డకు ఏ సమస్య వచ్చినా సొంతంగా మందులు ఇవ్వకండి. వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు సరైన పరిష్కారం పొందగలరు. చిన్న చిన్న అలవాటు మార్పులు కూడా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడతాయి.