Glaucoma tests: కళ్ళకు సంబంధించి ఎక్కువ మందిని వేధించే సమస్య గ్లకోమా. నీటికాసులు అని వాడుక భాషలో చెప్పుకునే గ్లకోమా వ్యాధి వలన దృష్టి పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి కన్ను పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ చాలా ఎక్కువ. గ్లకోమాను ప్రారంభ సమయంలో గుర్తిస్తే చికిత్స ద్వారా దానిని పెద్దగా కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే, గ్లకోమా పరీక్షలు కొంత క్లిష్టంగా ఉంటాయి. ఈ క్లిష్టతను తగ్గించడం కోసం శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి గ్లాకోమాతో బాధపడుతున్నాడా లేదా అనే విషయాన్ని జన్యు రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ప్రస్తుత పరీక్షల కంటే ఇది 15 రెట్లు మంచిది. ఈ పరీక్ష గ్లాకోమా ప్రారంభ దశలో గుర్తించే అవకాశం కల్పిస్తుంది.
ఈ కొత్త రకం ప్రోబ్‌ను ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. పరిశోధకులు, 4,13,844 మందిని పరీక్షించారు. జన్యు రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని సకాలంలో తెలుసుకోవడానికి ఎంత అవకాశం ఉంది అనే విషయాన్ని వీరిపై జరిపిన పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నం చేశారు. వీరిలో గ్లాకోమా రోగులతో పాటూ ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా ఉన్నారు.
గ్లకోమా గురించి మరికొంత..
నీటికాసులు అంధత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కారణం. గ్లాకోమాకారణంగా కంటిలోని సిరల్లో ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. దీని చెడు ప్రభావం కంటి చూపుపై మొదలవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, రోగి అంధుడవుతాడు. దేశంలో 40 ఏళ్లు పైబడిన 11 లక్షలకు పైగా రోగులు గ్లాకోమాతో బాధపడుతున్నారు.
పరీక్ష ఎలా పనిచేస్తుందంటే..
ఒక వ్యక్తి జన్యు సమాచారం తెలిస్తే, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించవచ్చని పరిశోధకుడు జామీ క్రెయిగ్ చెప్పారు. ఈ జన్యు సమాచారం రక్త పరీక్ష సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం, గ్లాకోమాను నిర్ధారించడానికి జన్యు పరీక్ష ఉపయోగించడం లేదు. కానీ అది జరిగితే, చాలా వరకూ ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించే వీలుంటుంది. ఇప్పటికే ఈ పరీక్షా విధానాన్ని క్లినికల్ ట్రయల్స్‌లో పరిశీలించడం ప్రారంభించారు.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 2507 మంది, బ్రిటన్‌లో 4,11,337 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ కొత్త పరీక్ష పాత పరీక్ష కంటే 15 రెట్లు మంచిదని వీరి అనుభవంలో తేలింది.
లాలాజలంతో కూడా పరీక్షలు చేయవచ్చు,
ప్రస్తుతం రక్త పరీక్షలతో గ్లకోమా కోసం జన్యు పరిశోధన చేస్తున్న పరిశోధకులు మరో ముందడుగు వేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. భవిష్యత్ లో మనిషి లాలాజలంతో కూడా ఈ జన్యు పరీక్షలు చేసి గ్లకోమా వ్యాధిని ప్రారంభంలో గుర్తించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం పూర్తయిందని వారు వెల్లడించారు.