ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలా తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండడమే కాక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు. ఇంకా శరీరానికి చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. చాలా సందర్భాలలో అతిదాహం వల్ల నిద్రభంగం కూడా జరుగుతుంది. అయితే పదే పదే దాహం వేయడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. వీటిని సకాలంలో గుర్తిస్తే ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదకరమైన వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చు. కాబట్టి తరచుగా దాహం వెనుక ఉండే కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం: రక్తంలో చక్కెర పరిమాణం పెరిగితే శరీరం పెరిగిన చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. ఫలితంగా శరీరంలో నీటిశాతం తగ్గి మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఇలా పదే పదే మూత్ర విసర్జన సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
రక్తపోటు: శరీరంలో రక్తపోటు పెరిగినట్లయితే చెమటలు విపరీతంగా వస్తాయి. ఇది డీ హైడ్రేషన్‌కు కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అధిక రక్తపోటు సమస్య చెడు జీవనశైలికి సూచన. ఈ పరిస్థితిలో అధిక రక్తపోటుతో పాటు, శరీరంలో నీటి కొరత కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలను మీరు ఎదుర్కొన్నట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
డీ హైడ్రేషన్: డీహైడ్రేషన్ అనేది శరీరంలో నీటి కొరతను సూచించే సాధారణ సమస్య. నీరు తక్కువగా తాగడం లేదా అస్సలే తాగకపోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. డీహైడ్రేషన్ అధిగమించడానికి పండ్ల రసాలు, కొబ్బరి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కళ్లు తిరిగి, అలసట సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..