ఇంట్లో తయారు చేసిన భోజనం అప్పుడప్పుడు మిగిలిపోతుంటుంది. అలాంటప్పుడు ఆ ఆహారాన్ని పడేయలేక చాలా మంది తింటుంటారు. కొందరు వేడి చేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పొట్టలో ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన పరిణామాల దారితీయవచ్చు. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే.. అది సూక్ష్మక్రిములను చంపడమే కాకుండా ఆహారంలోని పోషక విలువలు నశించిపోకుండా చూసుకుంటుంది. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల ఆ పోషకాలు నశించిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారాన్ని నిల్వ చేయడానికి ముందు.. పూర్తిగా చల్లబరచాలి. సాధారణ ఉష్ణోగ్రత వద్దకు చేరుకున్న ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తున్నప్పుడు కనీసం 65 డిగ్రీల అంతర్గత ఉష్ణోగ్రతకు చేరుకునేలా జాగ్రత్త పడాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద ఆహారంలో ఉండే హానికారక బ్యాక్టీరియా చనిపోతుంది. ఆహారాన్ని కనీసం రెండు నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. మిగిలిపోయిన వాటిని ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. చాలా సార్లు వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా రుచి, పోషక విలువలు కూడా తగ్గుతాయి.
ఆహారాన్ని మళ్లీ వేడి చేసిన తర్వాత ఉష్ణోగ్రత తగ్గకుండా పాత్రలపై మూత ఉంచాలి. మాంసం వంటకాలను మళ్లీ వేడి చేస్తున్నప్పుడు గ్రిల్ థర్మామీటర్‌తో వాటి ఉష్ణోగ్రతను కొలవాలి. మిగిలిపోయిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే ఆహారంలో చెడు బ్యాక్టీరియా పేరుకునే అవకాశం ఉంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి