Seat Belt Benfits: టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతికి కారణం ఇదేనా.. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..

వాహనాలు నడిపేటప్పుడు, వాహనల్లో ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఈవిషయం తెలిసినా కూడా మనం నిబంధనలు పాటించం. రూల్స్ ఫాలో కాకపోయినా కొన్ని..

Seat Belt Benfits: టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతికి కారణం ఇదేనా.. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..
Seat Belt

Updated on: Sep 07, 2022 | 10:06 PM

Seat Belt Benfits: వాహనాలు నడిపేటప్పుడు, వాహనల్లో ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఈవిషయం తెలిసినా కూడా మనం నిబంధనలు పాటించం. రూల్స్ ఫాలో కాకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు కాని.. చాలా సందర్భాల్లో నిబంధనలు పాటించని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతితో రహదారి నిబంధనలు చర్చనీయాంశమయ్యాయి. కారు వెనకాల కూర్చున సైరస్‌ మిస్త్రీ తో పాటు మరో వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోకపోవడమే వారి మృతికి కారణమని ప్రాథమికంగా తెలిసింది. అతివేగం కారణంగా కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు వెల్లడించారు. దేశంలో రహదారి ప్రమాదాలను చూసుకుంటే జనవరి నుంచి మే వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఇదే సమయానికి ఈఏడాది 7% ప్రమాదాలు పెరిగాయి.

అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 2,202 మంది మరణించారు. ఈఏడాది జనవరి నుంచి మే వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 2,357కి పెరిగింది. ఈఏడాది జూన్ 20న ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO నివేదిక ప్రకారం ప్రమాదాల సమయంలో కారు వెనుక సీటులో కూర్చునవారు సీటు బెల్టు పెట్టుకుంటే 25 % మేర మరణాలు, తీవ్రమైన గాయాలను తగ్గించవచ్చని పేర్కొంది. సీటు బెల్ట్ ధరించడం వల్ల డ్రైవర్, ముందు సీటులో ఉన్నవారిలో మరణించే వారి సంఖ్య సీటు బెల్టు ధరించని వారితో పోలిస్తే 45 నుంచి 50 శాతం తక్కువుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈసమయంలో కారులోని వెనుక సీట్లలో కూర్చున్న వారిద్దరూ సీటు బెల్టులు ధరించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఈప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే కారణమని తెలిసింది.

అతి వేగంగా కారు నడపడం వల్ల, కారును నియంత్రించలేక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సీటు బెల్టు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గీతా ప్రకాష్ న్యూస్9కు తెలిపారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ గీతా ప్రకాష్ తెలియజేస్తూ.. ఆకస్మిక కుదుపుల సమయంలో సీటు బెల్ట్ ధరించడం వల్ల నొప్పి అనిపించదని, అలాగే మనిషి కదలకుండా కూర్చున స్థానంలో ఉండేదుకు సహాయపడుతుందన్నారు. ఆకస్మిక కుదుపులు కొన్ని సందర్భాల్లో హానికరమని, అనేక తీవ్రమైన గాయాలకు ఇది కారణం కావచ్చని చెప్పారు. దూర ప్రయాణాలలో సీటు బెల్టు ధరించడం ఎంతో సురక్షితమని వెల్లడించారు డాక్టర్ గీతా ప్రకాశ్.

ఇవి కూడా చదవండి

మెడ, తుంటి, వెన్నెముక గాయాలను నివారించడంలో సీట్ బెల్ట్ సహాయపడుతుందని డాక్టర్ గీతా ప్రకాశ్ చెప్పారు. కారులో కూర్చునప్పుడు వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే సీటు బెల్టు పెట్టుకుని కూర్చోవాలని ఆమె సూచించారు. సీటు బెల్ట్‌లు ధరించడం వలన వెన్నుపూస పగుళ్లు, వెన్నెముక సమస్యలతో పాటు తల, మెదడుకు సంబంధించిన గాయాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. సీటు బెల్టు ధరించడం వల్ల తీవ్రమైన గాయాలు నివారించడానికి సహాయపడుతుందని మరో అధ్యయనంలో తేలింది. పిల్లలు, యుక్తవయసు వారు సీటు బెల్టు పెట్టుకున్నప్పటితో పోలిస్తే సీటు బెల్టు ధరించనప్పుడు జరిగిన ప్రమాదాల్లో మరణాలు, తీవ్రమైన గాయాల శాతం దాదాపు 71% ఎక్కువని ఓ అధ్యయనం వెల్లడించింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..