Health Tips: రాత్రిపూట చెమటలు పడుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త.. వాటి వల్లే కావచ్చు..

రాత్రిపూట తరచుగా చెమట పట్టడం అనేది వేడి వల్ల మాత్రమే కాదు.. అది ఏదో వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా నిద్రపోతున్నప్పుడు కూడా చెమటతో తడిసిపోతే, దానిని తేలికగా తీసుకోకండి. ఒకవేళ లైట్ తీసుకుంటే ఆ తర్వాత పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు.

Health Tips: రాత్రిపూట చెమటలు పడుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త..  వాటి వల్లే కావచ్చు..
Night Sweat

Updated on: Jul 19, 2025 | 9:59 PM

ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడు చాలా మందికి రాత్రి చెమటలు పడటం కామన్. కానీ స్పష్టమైన కారణం లేకుండా పదే పదే చెమటలు పడితే, అది శరీరంలోని తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ చెమటలు పట్టడం హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు. అందువల్ల రాత్రిపూట చెమటలు పట్టడం అనేది వాతావరణం యొక్క ప్రభావం మాత్రమే కాదని, కొన్నిసార్లు ఇది శరీరం నుండి వచ్చే హెచ్చరిక కూడా అని తెలుసుకోవడం ముఖ్యం. తరచుగా రాత్రి చెమటలు పడటం కొన్నిసార్లు శరీరంలోని ఒక వ్యాధికి ముందస్తు సంకేతం కావచ్చు. రాత్రిపూట చెమటలు పట్టడం వేడి వల్ల కాకపోతే, దానిని తేలికగా తీసుకోకూడదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు.

హార్మోన్ల మార్పులు

రాత్రిపూట చెమట పట్టడం కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌కి ముందు లేదా పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు చెమట పట్టడానికి కారణమవుతాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు పురుషులకు కూడా రాత్రి చెమటలు పట్టవచ్చు. థైరాయిడ్ వంటి ఎండోక్రైన్ సమస్యలు కూడా ఈ లక్షణాన్ని పెంచుతాయి.

ఇన్ఫెక్షన్ లేదా టీబీ సంకేతం

ఎటువంటి కారణం లేకుండా రాత్రిపూట పదే పదే చెమటలు పట్టడంతో పాటు బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జ్వరం ఉండడం వంటి టీబీ వ్యాధి సంకేతం కావచ్చు. ఇది టీబీ రోగులలో ఒక సాధారణ లక్షణం. దీనితో పాటు హెచ్ఐవీ, మలేరియా, బ్రూసెల్లోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా రాత్రి చెమటలు పట్టడానికి కారణం కావచ్చు.

మానసిక ఒత్తిడి – మందుల ప్రభావం

మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ కూడా రాత్రి చెమటలకు ప్రధాన కారణం కావచ్చు. ఆందోళన కారణంగా, శరీరంలోని నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. దీని వలన రాత్రిపూట చెమట పడుతుంది. దీనితో పాటు కొన్ని యాంటిడిప్రెసెంట్స్, జ్వరాన్ని తగ్గించే మందులు కూడా శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. దీని వలన చెమట పడుతుంది.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?

రాత్రిపూట చెమటలు పట్టడం కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతూ, అలసట, జ్వరం, బరువు తగ్గడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..