Stay Fit: 40+ తర్వాత కూడా ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేసి చూడండి!

వయసు నలభై దాటితే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కండరాల శక్తి, ఎముకల సాంద్రత, మెటబాలిజం తగ్గుతుంది. ఈ మార్పులను ఎదుర్కోవడానికి సరైన వ్యాయామాలు చేయడం చాలా అవసరం. నలభై దాటాక ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ వయస్సులో చేసే ..

Stay Fit: 40+ తర్వాత కూడా ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేసి చూడండి!
Yoga & Breath Exercise

Updated on: Nov 18, 2025 | 1:32 PM

వయసు నలభై దాటితే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కండరాల శక్తి, ఎముకల సాంద్రత, మెటబాలిజం తగ్గుతుంది. ఈ మార్పులను ఎదుర్కోవడానికి సరైన వ్యాయామాలు చేయడం చాలా అవసరం. నలభై దాటాక ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ వయస్సులో చేసే వ్యాయామాలు దీర్ఘకాలిక ఆరోగ్యానికి, చురుకుదనానికి, ఆనందానికి తోడ్పడతాయి. రోజూ 30–45 నిమిషాలు పలు వ్యాయామాలు చేస్తే ఎముకలు దృఢంగా, గుండె ఆరోగ్యంగా, మనసు సంతోషంగా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..

1. నడక (Brisk Walking)

ఇది సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నడవడం వల్ల మోకాళ్లు, కీళ్ల జాయింట్లపై ఒత్తిడి పడకుండా శరీరానికి తగిన వ్యాయామం అందుతుంది. ఎముకలు బలంగా ఉండటానికి, శరీర బరువు సమతుల్యత కోసం నడక ఒక అద్భుతమైన వ్యాయామం.

2. యోగాసనాలు (Yoga)

వయసు పెరిగేకొద్దీ శరీరంలోని స్నాయువులు, కండరాలు గట్టిపడతాయి. యోగాసనాలు ఈ గట్టితనాన్ని తగ్గించి, జాయింట్లను దృఢంగా మారుస్తాయి. త్రికోణాసనం, పవనముక్తాసనం, తాడాసనం వంటి ఆసనాలు శరీరాన్ని శక్తివంతంగా మారుస్తాయి. శ్వాసక్రియ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, మానసిక స్థైర్యాన్ని కల్పిస్తాయి. నిత్యజీవితంలో కూర్చోవడం, లేవడం, నిల్చోవడంలో సహాయపడతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోకుండా కూడా ఇవి రక్షణ ఇస్తాయి.

3. ఈతకొట్టడం (Swimming)

నీటిలో చేసే వ్యాయామాలకు ఎముకలపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ మొత్తం శరీరంలోని కండరాలను పని చేయిస్తుంది. ఇది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం కూడా. హృదయ స్పందనను నియంత్రిస్తుంది, శరీరం సామర్థ్యాన్ని పెంచుతుంది. మోకాళ్లు, వెన్నెముక నొప్పి ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన వ్యాయామం.

4. ప్రాణాయామం (Deep Breathing Exercises)

వ్యాయామం అంటే కండరాల కదలిక మాత్రమే కాదు. ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు శరీరానికి ప్రాణాన్ని పోస్తాయి. రోజుకు 10-15 నిమిషాలు ప్రాణాయామం చేయడం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది, శ్వాసక్రియ సరైన పద్ధతిలో జరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.

ఏదైనా వ్యాయామాన్ని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరంభంలో తక్కువ సమయంపాటు వ్యాయామం చేసి క్రమంగా సమయాన్ని పెంచాలి. వ్యాయమం చేసే సమయంలో కీళ్లు, కండరాల్లో నొప్పి వస్తే వెంటనే ఆపేయాలి. తగినంత నీరు తాగాలి. వ్యాయామం ముందు, తర్వాత కూడా వార్మప్స్​ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం మీరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఆరోగ్యంగా జీవించండి!

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)