Healthy Sleep Habits: ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటే నిద్ర సమస్యలు అన్ని పోతయ్..!
నిద్ర సరిపోకపోతే శరీరం అలసిపోతుంది. దాని ప్రభావం రోజంతా కనిపిస్తుంది. పనిలో ఆసక్తి తగ్గుతుంది. చిరాకు ఎక్కువవుతుంది. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇది రోజు మొత్తం మీద ప్రభావం చూపుతుంది. అందుకే నిద్ర అవసరం ఎంత ముఖ్యమో తెలిసిపోతుంది.

చాలా మందికి పడుకున్నాక కూడా నిద్ర రావడం కష్టమవుతుంది. శరీరం అలసిపోయి ఉన్నా.. మైండ్ నిద్రకు సహకరించదు. కొన్ని గంటలు మంచంపై అటు ఇటూ బొర్లుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తారు. కానీ ఫలితం కనిపించదు. ఇలాంటి సమయాల్లో అసలైన కారణాలు తెలుసుకొని వాటికి సరైన మార్గం ఎంచుకుంటే మంచిది.
మనసు బలంగా కలత చెందితే నిద్ర రావడం కష్టం అవుతుంది. ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే మనం విశ్రాంతిగా నిద్రపోలేకపోతాం. ఉదాహరణకి పనిపట్టింపు, కుటుంబం గురించి ఆందోళనలు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ నిద్రను దెబ్బతీస్తాయి. పడుకునే ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం, లోతుగా శ్వాస తీసుకోవడం సహాయపడుతుంది. మనసు నిశ్చలంగా ఉంటే నిద్ర త్వరగా వస్తుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కాళ్లు ముంచడం మంచిది. ఇది ఒక రకమైన వాటర్ థెరపీ. శరీరం అలసట తగ్గుతుంది. శరీరం ఉల్లాసంగా మారుతుంది. ఇది నిద్రకు అనుకూలమైన పరిస్థితిని కలిగిస్తుంది. 10 నిమిషాలు ఇలా కూర్చొంటే మంచి ఫలితం కనబడుతుంది.
లావెండర్ వాసన మనసుకు తేలిక కలిగిస్తుంది. దీని సువాసన మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. లావెండర్ ఫ్లేవర్ ఉన్న కొవ్వొత్తులు వెలిగించవచ్చు. లేకపోతే గదిలో లావెండర్ స్ప్రే చేయొచ్చు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గి నిద్ర త్వరగా వస్తుంది.
మురికి బెడ్ షీట్ వల్ల నిద్రలో అంతరాయం కలగొచ్చు. పరుపు నుండి మంచి వాసన రాకపోతే మనసుకు అసౌకర్యంగా ఉంటుంది. కనీసం వారానికి రెండుసార్లు బెడ్ షీట్ మార్చడం మంచిది. పరిశుభ్రమైన పరిసరాలు మానసికంగా ప్రశాంతత కలిగిస్తాయి. ఇది నిద్రకు సాయపడుతుంది.
నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. మానసిక ప్రశాంతత, శరీర విశ్రాంతి రెండూ నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే నిద్ర సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కాలు ప్రతి రోజూ పాటించడం వల్ల మార్పు కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించండి.




