
మనందరం ఊపిరి పీల్చుకోవడం ఒకే విధంగా చేస్తామని అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఓ విప్లవాత్మక విషయం వెల్లడించారు. మనం పీల్చే శ్వాసలోని వాసన, ప్రవాహం, విధానం మన ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలపై సమాచారం ఇస్తాయని వారు చెప్పారు. ఈ ప్రత్యేక లక్షణాలను ‘శ్వాస ఫింగర్‌ప్రింట్స్’గా పేర్కొంటూ.. ఇవి బాడీ మాస్ ఇండెక్స్ (BMI), నిద్ర విధానాలు, ఆందోళన స్థాయిలు, ప్రవర్తన లక్షణాల వంటి అంశాలను తెలియజేస్తాయని వారు నిర్ధారించారు.
ఈ అధ్యయనాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నిర్వహించి, ప్రముఖ జర్నల్ కరెంట్ బయాలజీలో ప్రచురించారు. ఈ పరిశోధనలో శ్వాస మార్గాన్ని 24 గంటలపాటు విశ్లేషించేందుకు ప్రత్యేకమైన పరికరాన్ని రూపొందించారు. చిన్న, తేలికైన ఈ పరికరాన్ని ముక్కులో ఏర్పాటు చేసి, శ్వాస ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. పరీక్షలో భాగంగా, ఆందోళనకు గురయ్యే వ్యక్తుల శ్వాస విధానంలో కొన్ని ప్రత్యేక మార్పులను గుర్తించారు. ముఖ్యంగా ఇన్హేలేషన్ సమయం తక్కువగా ఉండటం, నిద్రలో శ్వాసలో అధిక వైవిధ్యం కనిపించడం వంటి లక్షణాల ద్వారా ఆందోళన స్థాయి, నిద్ర నియమాలు, ప్రవర్తనకు సంబంధించిన వివరాలను అంచనా వేయగలమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
మన శ్వాస మార్గంలో జరిగే మార్పుల ఆధారంగా అనేక ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ఆందోళన స్థాయి, నిద్ర సంబంధిత అంతరాయం, ప్రవర్తనా లక్షణాలు వంటి అంశాలు శ్వాస విధానంతో అనుబంధంగా ఉండటాన్ని ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఈ పరిశోధన మన శ్వాస విధానాన్ని అర్థం చేసుకునే దిశగా విప్లవాత్మక మార్గం చూపుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో, మెరుగైన చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయడంలో సహాయపడగలదని వారు పేర్కొన్నారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.