
kidney stones: మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. మలినాలు శుభ్రం చేయడంతోపాటు మనం ధృఢంగా ఉండేందుకు కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరు బాగున్నప్పుడే శరీరంలోని మలినాలన్నీ తొలిగిపోయి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు.

కిడ్నీల పనితీరు దెబ్బతింటే.. శరీరంలో మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి అనారోగ్య సమస్యలు తెలెత్తుతాయి. అందుకే కిడ్నీల విషయంలో, తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో అధికమైన లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. చాలావరకు ఇవి చిన్న సైజులోనే ఉంటాయి. కానీ యూరిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను ఎక్కువ తినడం వల్ల వాటి పరిమాణం పెరిగిపోతుంది. దీనివల్ల జ్వరం, ఇన్ఫెక్షన్లు, బొడ్డు, వీపు భాగంలో నొప్పి సమస్యలు తలెత్తుతాయి.

ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ఆక్స్‌లైట్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆక్సలైట్ ఆహార పదార్థాలను కిడ్నీలు శుభ్రం చేయలేవని..దీంతో అవి శరీరంలోనే ఉండి రాళ్లుగా పేరుకుపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

బచ్చలికూర, బీట్‌రూట్, కందగడ్డ, టీ, చాక్లెట్ వంటి వాటిల్లో ఆక్సలైట్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, శీతల పానీయాలు ఉప్పు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాలను మితంగా తీసుకోవాలని, నీరు బాగా తాగాలని సూచిస్తున్నారు.