Diabetes: డయాబెటిస్ బాధితులు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినొద్దు.. వైద్యుల హెచ్చరిక ఇదే

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, చాలా మంది చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలు ఎంటో తెలియక సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీంతో వారికి డయాబెటిస్ మరింత తీవ్రమవుతుంది. డయాబెటిస్ రోగులు ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

Diabetes: డయాబెటిస్ బాధితులు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినొద్దు.. వైద్యుల హెచ్చరిక ఇదే
Sugar Diabetes

Updated on: Jan 02, 2026 | 4:02 PM

ఇటీవల కాలంలో మధుమేహం (డయాబెటిస్) వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, క్రమరహిత దినచర్యలు ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో డయాబెటిస్ బాధితులు తీసుకునే ఆహారం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో శరీర అవసరాలు మారుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితమవుతాయి.

డయాబెటిస్ బాధితులు ఉదయం పూట తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినే ఆహారాలు రోజంతా మీ చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తినాలి? ఏ ఆహారం తినకూడదో తెలుసుకోవాలి.

ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి?

డయాబెటిస్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో తెలికైన పోషకాహారాలు తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోజుకు మంచి ప్రారంభం లభించినట్లవుతుందని అంటున్నారు. నానబెట్టిన బాదం లేదా వాల్నట్స్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

మొలకెత్తిన పప్పులు, ఓట్స్, గంజి వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయన్నారు. ఉసిరి లేదా దాని రసం ఉదయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. లేత ఆకుపచ్చ కూరగాయల రసాలు లేదా సలాడ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రోజంతా శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఖాళీ కడుపుతో ఏం తినకూడదంటే?

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. చక్కెర కలిపిన టీ, చక్కెర లేదా బెల్లం కలిపిన పాలు, ప్యాక్ చేసిన రసాలు ఖాళీ కడుపుతో తాగడం హానికరం కావచ్చు. ఇంకా తెల్ల బ్రెడ్, బిస్కెట్లు, కేకులు లేదా వేయించిన ఆహారాలు కూడా చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. అరటి పండులాంటి చక్కెర స్థాయిలను పెంచే పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. ఈ ఆహారాలు ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. దీంతో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది.

డయాబెటిస్ నియంత్రణ ఎలా?

ప్రతిరోజూ నిర్ణీత సమయంలోనే ఆహారం తినండి
మీ దినచర్యలో తేలికపాటి వ్యాయామం లేదా నడక ఉండాలి
సమయానికి మందులు తీసుకోవాలి
మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి
తగినంత నిద్రపోవడంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండాలి.