ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు పది కోట్ల మంది చేస్తున్న పోరాటమిది. పది కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్లమందిని మానసికంగా వేధిస్తోంది ఇది. దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా.. 11.4 శాతం. యుద్ధం చేద్దామంటే శత్రువు దొరకడు. కంటికి కనిపించడు. అయినా పోరాటం తప్పదు. పేరుకు షుగరే.. కానీ తేడా వస్తే.. ప్రాణాంతకం. ఆ సైలెంట్ కిల్లర్ పేరు.. డయాబెటిస్.
షుగర్ పేషెంట్ల నెంబర్ గురించి చెప్పుకున్నాం. కానీ డయాబెటీస్ బారిన పడడానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది. అదే ప్రీ డయాబెటీస్. మన దేశంలో ఈ స్టేజ్ లో ఉన్నవారు ఎందరో తెలుసా? 13 కోట్ల 60 లక్షలు. మన దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా? 15.3 శాతం. మన దేశంలో మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే.. ఈ నెంబర్ చాలా ఎక్కువ. అంటే దేశంలో షుగర్ పేషెంట్లు, షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్ల నెంబర్ ను కలిపితే.. దాదాపు 24 కోట్లు. ఈ అంకె చూస్తే మతిపోతుంది. అంటే ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అర్థమవుతుంది. దేశానికి సవాల్ విసురుతోంది. అలెర్ట్ అవ్వమని హెచ్చరిస్తోంది. అసలీ షుగర్ వ్యాధి.. స్వీట్స్ తింటే వస్తుందా? టెన్షన్ పెరిగితే వస్తుందా? ఎక్సర్ సైజ్ లేకపోతే వస్తుందా? అసలెందుకు వస్తుంది? నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ అవగాహన లేదు. డాక్టర్లు చెబితే వినే పరిస్థితి లేదు. పోనీ టెస్టు చేయించుకుంటారా అంటే అదీ లేదు. నిజం చెప్పాలంటే.. చాలామందికి ఆర్థికంగా ఆ అవకాశమూ లేదు. మరి దీనికి పరిష్కారమేంటి? అందుబాటులో ఉన్న చికిత్సలేంటి?
చాలామంది షుగర్ పేషెంట్లు చెప్పే మాట ఒక్కటే. అసలు మాకెలా షుగర్ వచ్చిందో అర్థం కావడం లేదండి. నేనసలు స్వీట్సే తినను.. అయినా ఎందుకొచ్చిందో అని బాధపడుతుంటారు. నిజానికి స్వీట్స్ తింటే షుగర్ వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఇది నిజమా అబద్ధమా అన్నదానికన్నా.. పరిమితికి మించి తీపిపదార్థాలు తీసుకోవడం.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. డయాబెటీస్ రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. మన దేశంలో రోగం రాకముందే.. నిర్ణీత కాలానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అన్నదానిపై ఇంకా చాలామందికి అవగాహన లేదు. ఎవరైనా హెల్త్ చెకప్ చేయించుకోండి అంటే.. నాకేమైనా జబ్బా.. నేనెందుకు చేయించుకోవాలి అంటారు.
మధుమేహం చాపకింద నీరులా శరీరమంతా ప్రవహిస్తుంది అన్నది పచ్చి నిజం. అసలీ వ్యాధి తమ శరీరంలో ఉన్నట్టు చాలామందికి తెలియదు. వాళ్లలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించవు. ఇక 80 శాతం మంది రోగుల్లో 3 దశల తరువాతే ఈ వ్యాధి ఉన్నట్టు బయటపడుతోంది. అంటే వాళ్లు డేంజర్ జోన్ లోకి వచ్చేసినట్టే. నిజానికి ఈ మూడు స్టేజ్ లలోపే దీనిని గుర్తించగలిగితే.. షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. అయితే మరికొందరిలో.. తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నప్పుడు వాళ్లకు డయాబెటీస్ ఉన్నట్టు నిర్థారణ అవుతోంది. కానీ అప్పటికే ఇది శరీరానికి ఎంత దారుణం చేయాలో అంతా చేసేస్తుంది. అందుకే డయాబెటీస్ ను వైద్యులు.. స్వీట్ పాయిజన్ అంటారు. ఇక డయాబెటీస్ లో టైప్1, టైప్2 అని రెండు రకాలు ఉన్నాయి. దేశంలో షుగర్ పేషెంట్లలో 90 శాతం మంది టైప్2తో బాధపడుతున్నవారే.
షుగర్ వ్యాధి లక్షణాలను చూస్తే.. దాహం ఎక్కువగా వేస్తుంది. తరచుగా యూరిన్ కు వెళ్లాల్సి ఉంటుంది. నీరసం పెరిగిపోతుంది. ఆకలి ఎక్కువసార్లు వేస్తుంది. కంటి చూపు శక్తి తగ్గుతుంది. గాయమైతే.. అది త్వరగా మానదు. బరువు కూడా తగ్గిపోతారు. ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే వైద్యుడిని సంప్రదించిన తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మరి షుగర్ ఉందని నిర్థారణ చేసే పరీక్ష సంగతేంటి? HbA1c పరీక్ష ఉంటుంది. ఈ టెస్టు చేయించుకుంటే.. శరీరంలో డయాబెటిస్ ఉందో లేదో తెలుస్తుంది. షుగర్ లెవర్.. 5.7 శాతం లోపు ఉంటే.. నో ప్రాబ్లమ్. అదే 5.7 నుంచి 6.4 శాతం మధ్యలో ఉంటే.. వారు డయాబెటీస్ కు ముందు స్టేజ్ లో ఉన్నారని అర్థం. అదే ఈ స్థాయి 6.5 శాతం దాటితే.. వారికి డయాబెటీస్ ఉన్నట్టే. ఇక మరో రకమైన షుగర్ టెస్ట్ కూడా ఉంది. పరగడుపున షుగర్ లెవల్స్ 100 నుంచి 126 లోపు, అలాగే అల్పాహారం తీసుకున్నాక.. 140 నుంచి 200 లోపు ఉంటే.. వారికి షుగర్ వచ్చే ఛాన్సుందని అర్థం. ఒకవేళ పరగడపున షుగర్ స్థాయి 126 కన్నా ఎక్కువున్నా, అల్పాహారం తీసుకున్నాక.. 200 కంటే ఎక్కువున్నా వారు డయాబెటీస్ బారిన పడినట్టే. అయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే డాక్టర్ సూచనలతో మందులు తీసుకుంటే.. డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ ను నియంత్రించలేకపోతే.. కిడ్నీలు, నరాలు, కళ్లు, గుండె ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అయితే.. డయాబెటీస్ వచ్చినంత మాత్రాన జీవితమేదో ముగిసిపోయినట్టు కాదు. కుళ్లి కుళ్లి ఏడవాల్సిన పనీ లేదు. కాకపోతే.. జీవనశైలి మీద పట్టు మాత్రం ఉండాలి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అన్నది చాలా ముఖ్యం. సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. ఆందోళన, ఒత్తిడి.. వీటికి దూరంగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవల్ ను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇంకా చెప్పాలంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులతో మధుమేహాన్ని జయించవచ్చు. అంటే ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు.. ఒక క్రమపద్దతిలో జీవితాన్ని గడపగలిగితే.. డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచడం సాధ్యపడుతుంది.
డయాబెటీస్ ఉన్నవారు.. ప్రాసెస్ చేసిన ఫుడ్ ని అస్సలు తీసుకోకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి. తగినంత వ్యాయామం అవసరం. సమతులమైన ఆహారం.. ఈ వ్యాధిని చాలావరకు కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తంలో చక్కె స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లో ఉండాలి. దీనికి అవసరమైన పరీక్షలను తరచుగా చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది.