
ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ చాలా ముఖ్యమైన దశ. ఈ సమయంలో తీసుకునే ఆహారం, మందులు, వ్యాయామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే తల్లి ఆరోగ్యంపైనే గర్భంలోని శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో తల్లులు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. అందులో ఒకటి మలబద్ధకం సమస్య. గర్భధారణ సమయంలో మహిళలు అజీర్ణం, మలబద్ధకం సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందొచ్చో నిపుణుల మాటల్లో మీకోసం.. గర్భధారణ సమయంలో మలబద్ధకం చాలా సాధారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలోని హార్మోన్లలో మార్పుల కారణంగా ఇలా జరుగుతుందట. ఈ సమయంలో ప్రేగులపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా ఆహారంలో తగినంత పీచు పదార్ధం, నీరు, వ్యాయామం లేకపోవడం వల్ల గర్భిణులు మలబద్దకానికి గురవుతున్నారు. గర్భిణీ స్త్రీలు కొన్ని హోం రెమెడీస్‌తో మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గర్భం దాల్చినప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని త్రాగాలి. మలబద్ధకం నుంచి బయటపడటానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. పైగా ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలను చూపదు. రోజుకు దాదాపు 2 నుండి 3 లీటర్ల నీరు తాగుతుండాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహారం తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఏదైనా తినేటప్పుడు, దానిని పూర్తిగా నమలాలి. దీనితో పాటు ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కడుపుని బాగా శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా రోజూ అరటిపండు, జామపండు వంటివాటిరి తింటుండాలి. ఆహాకంలో ఫైబర్ అధికంగా ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజు వారీ భోజనంలో చేర్చడం వల్ల కడుపు బాగా శుభ్రపడుతుంది. ఆహారంలో కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా తగినన్ని పోషకాలు అందుతాయి.
గర్భిణీ మహిళలు ప్రోబయోటిక్ ఆహారాలను తినాలి. పెరుగు, ఇతర పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా కనిపిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హైడ్రేషన్ లెవెల్ సమతూకం అవుతుంది. వీటిని రోజూ తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, తేలికపాటి నడక, యోగా చేయడం ముఖ్యం. అయితే ముందుగా వైద్యుడిని సంప్రదించి, వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోకూడదు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.