
చలికాలం వచ్చేసింది.. రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతుంది. సీజనల్ ఛేంజ్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం. కానీ వాతావరణ మార్పులు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ప్రభావితం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చలికాలం శరీరం, మనసు రెండింటినీ గాఢంగా ప్రభావితం చేస్తుంది. చలి వాతావరణం వల్ల కలిగే నిరాశ, ఆందోళన, ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు సాధారణంగా మూడ్ మార్పులుగా భావిస్తారు.
దీనిని సీజనల్ అఫెక్టివ్ డిసార్డర్ (SAD) అంటారు. ఇది చలికాలంలో సూర్యకాంతి తగ్గడం వల్ల వచ్చే సమస్య. ముఖ్యంగా వృద్ధుల్లో ఇది తీవ్రంగా కనిపిస్తుంది. వయసు ప్రభావం కారణంగా సర్కాడియన్ రిథమ్ సులువుగా అస్తవ్యస్తమవుతుంది. సూర్యకాంతి తగ్గడం వల్ల మెదడులో సెరటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయిలు పడిపోతాయి.
ఇది ఉత్సాహం, సంతోషం కలిగించే హార్మోన్. అదే సమయంలో మెలటోనిన్ (నిద్ర నియంత్రక హార్మోన్) అధికంగా ఉత్పత్తి అవుతుంది, దీంతో అతిగా నిద్రపోవాలనిపిస్తుంది. విటమిన్ డి లోపం కూడా SADకి ఒక కారణం. పరిశోధనల ప్రకారం, ఉత్తర అక్షాంశాల్లో (యూరప్, అమెరికా) జనాభాలో 5-10% మంది SADతో బాధపడతారు. భారత్‌లో హిమాలయ ప్రాంతాలులైన కాశ్మీర్, లడఖ్ వంటి చోట్ల ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చలికాలంలో పగటి సమయం తగ్గిపోతుంది. మంచు ఎక్కువ కురుస్తుంది.
ఆకలి తగ్గడం, మాట్లాడటానికి ఇష్టం లేకపోవడం, చిరాకు, ఏకాగ్రత లోపం, బరువు పెరగడం (కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలనిపించడం వల్ల) అనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా అనిపించవచ్చు, కానీ SAD వల్ల అయితే చలికాలంలో పెరిగి, వేసవిలో తగ్గిపోతాయి. ఈ సమస్యను కొన్ని పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు.
1. రోజూ 30-45 నిమిషాలపాటు ఎండలో లేదా ఘాడమైన కాంతిలో కూర్చోవడం వల్ల శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచవచ్చు. ముఖ్యంగా వృద్ధులు ఉదయం వేళల్లో 15-20 నిమిషాలపాటు నడవడం వల్ల శరీరానికి కావలసిన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
2. యోగా, స్ట్రెచింగ్ లేదా నడక వంటి వ్యాయామాల వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై మూడ్ మెరుగుపడుతుంది.
3. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల SAD సమస్యను తగ్గించుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్) మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
4. కుటుంబ సభ్యులతో కలిసి ఆటలు, మాటలు, సంగీతం వంటి సరదా ఆటలవల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఒంటరితనం SADని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య నివారణకు వైద్యపరంగా యాంటీ-డిప్రెసెంట్స్ లేదా CBT (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ) సహాయపడతాయి.
చలికాలం వల్ల అందరిలో ఈ సమస్య ఏర్పడదు. కానీ అప్రమత్తత చాలా ముఖ్యం. వృద్ధులను గమనించి, హుషారుగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఇది కేవలం చాదస్తం కాదు, చికిత్స అవసరమైన సమస్య. ముందస్తు జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.