
Binge Eating Disorder: అతిగా తినడం ఒక రోగం. ఇష్టమైన ఆహారాన్ని ఒకసారి తినడం వేరు.. కానీ ప్రతి ఐదు, పది నిమిషాలకు ఒకసారి ఎక్కువ ఆహారం తినడం ఒక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా 2శాతం కంటే ఎక్కువ మందికి ఇలాంటి వింత అలవాట్లు ఉన్నాయని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. అయితే, అతిగా తినడం వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అయితే, అతిగా తినడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతిగా తినాలనిపించడం.. ఒక రోగం అని, దానిని బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. టీవీ, మొబైల్ చూస్తూ కూడా అధికంగా తింటారని, ఒత్తిడి, వ్యవసనాలు, ఇతర కారణాల వల్ల కూడా అధికంగా తింటారని నిపుణులు చెబుతున్నారు.
ఏది చూసినా తినాలనిపిస్తుంది: బింజ్ ఈటింగ్ కొందరికి ఏది చూసినా తినాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ ఆలోచనలు మరింత పెరుగుతాయి. తద్వారా అధికంగా తింటారు. అదికాస్తా అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇకపోతే.. నిరాశ, కోపం, ఆందోళన, భయం, ఒంటరితనం లేదా ఏదైనా ఇతర కారణాలతో ఒంటరి భావనతో ఉన్నప్పడు.. వాటిని మర్చిపోవడానికి అతిగా తింటారని నిపుణులు విశ్లేషించారు.
అతిగా తినే అలవాట్లను మార్చవచ్చు..
అనేక అలవాట్ల మాదిరిగానే.. ఆహారపు అలవాట్లను మార్చవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలా కాలంగా ఈ అలవాటు ఉంటే.. బయటపడటం కొంచెం కష్టమైనా కచ్చితంగా మార్చుకోవచ్చు అని చెబుతున్నారు. ఇక ఎమోషనల్ ఈటింగ్ ఉన్న చాలా మంది వ్యక్తులు తక్కువ పోషక విలువలు కలిగిన అధిక కార్బోహైడ్రేట్, అధిక కేలరీల ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడి వంటి ప్రతికూల భావోద్వేగాలకు గురవుతారని పేర్కొన్నారు.