మీరు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? కారణం ఇదే.. టేక్ కేర్

విటమిన్ సీ అనేది మన ఆరోగ్యానికి అత్యంత అవసరమైన విటమిన్. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేగాక, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. చాలా మంది తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. విటమిన్ సీ లోపం కారణంగానే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే తగినంత విటమిన్ సీ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మీరు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? కారణం ఇదే.. టేక్ కేర్
Vitamin C Deficiency

Updated on: Jan 02, 2026 | 5:00 PM

కొందరు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. తమకు ఎలాంటి దురాలవాట్లు లేకపోయినా ఇలా ఎందుకు జరుగుతుందని చింతిస్తుంటారు. అయితే, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లే వారు ఇలా తరచూ జబ్బుల బారినపడుతుంటారు. శరీరానికి అవసరమైన విటమిన్లు అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అందుకే వైద్యులు శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెబుతుంటారు.

తరచూ అనారోగ్యానికి గురికావడం అనేది సీ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు. సీ విటమిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేగాక, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గాయాలు త్వరగా నయం కావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సీ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ముడతలు, నల్లటి వలయాలను నివారిస్తుంది. విటమిన్ సీ కలిగిన పండ్లను తరచూ తీసుకుంటే అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచంలో అనేక మంది విటమిన్ సీ (Vitamin C) లోపంతో బాధపడుతున్నారు. వారంతా జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ బయోమెడికల్ సైన్సెస్(JABS) ప్రకారం భారతదేశంలో కనీసం 30 శాతం మంది మిటమిన్ సీ లోపతంతో బాధపడుతున్నారు. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ వన్ ప్రకారం.. ఉత్తర భారతదేశంలో 74 శాతం మంది, దక్షిణ భారతదేశంలో 46 శాతం మంది విటమిన్ సీ లోపంతో బాధపడుతున్నారు.

విటమిన్ సీ పొందాలంటే ఏం చేయాలి?

విటమిన్ సీ అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడదు. ఆహారం, పండ్ల నుంచి ఎక్కువగా లభిస్తుంది. గూస్బెర్రీస్, పైనాపిల్స్, నారింజ, కివీ, బ్రోకలీ వంటి పుల్లని రుచి గల పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ పొందవచ్చు. శరీరానికి కనీసం 75-90 మిల్లీగ్రాముల విటమిన్ సీ అవసరం అవుతుంది. అయితే, ఈ మొత్తం వయస్సును బట్టి మారుతుంది. చిన్న పిల్లలకు 75-90 మిల్లీగ్రాముల కంటే కొంచెం తక్కువగా, పాలు ఇచ్చే మహిళలకు కొంచెం ఎక్కువగా విటమిన్ సీ అవసరం అవుతుంది.

విటమిన్ సీ లోపం వల్ల తరచుగా అలసట, నిరంతరం అనారోగ్యం, పొడి చర్మం, చిగుళ్లలో రక్తస్రావం, ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పండ్ల నుంచే గాక, అవసరమైన సమయంలో విటమిన్ సీని మాత్రల రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే, ఇందుకు వైద్యులను సంప్రదించాలి. దీని కంటే పండ్ల రూపంలోనే విటమిన్ సీని తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది.