
ఇటీవల కాలంలో రాత్రిపూట సరైన సమయంలో నిద్రపోవడం అనేది ఎవరికీ సాధ్యం కావడం లేదు. నగరాల్లో ఉండేవారికి మాత్రం అది అసాధ్యమే అవుతుంది. ఉద్యోగులు షిఫ్టుల్లో తమ విధులు నిర్వహిస్తుండటంతో చాలా మంది సమాయానికి నిద్రపోయే పరిస్థితి లేదు. అవకాశం ఉన్న మరికొందరు మాత్రం టీవీలు, ఫోన్లకు అతుక్కుని తమ నిద్రకు దూరమవుతున్నారు. అయితే, తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక తాజా అధ్యయనం ప్రకారం.. వరుసగా 3 నుంచి 4 గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వల్ల రక్తంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి ప్రభావాలు వృద్ధులలోనే కాదు, ఆరోగ్యవంతులైన యువతలో కూడా కనిపిస్తాయి. అందుకే ఏ వయస్సు వారైనా తగినంత నిద్ర తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
యువతపై ప్రయోగం
నిద్రలేమి(Late Night Sleep)పై నిర్వహించిన ఓ అధ్యయనంలో 15 మంది ఆరోగ్యవంతులైన యువకులను ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ యువకులకు 3 రోజులు 8.5 గంటల సరైన నిద్ర, మరో మూడు రోజులు 4.25 గంటల నిద్ర కల్పించారు. ఆ తర్వాత వారిని పరీక్షించారు. అయితే, 4 గంటలపాటు నిద్రించిన యువతలో పలు ఆరోగ్య సమస్యలను గుర్తించారు. రక్తపోటు పెరగడంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచినట్లు తేల్చారు.
రాత్రి ఆలస్యంగా పడుకునే లేదా ఆలస్యంగా మేల్కునే వ్యక్తులకు ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఆలస్యంగా నిద్రపోయే వారి కంటే ఆలస్యంగా మేల్కునే వ్యక్తుల మానసిక ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుందని తెలిపింది.
రాత్రిపూట త్వరగా భోజనం పూర్తి చేసి నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలని, చీకటి గదిలో నిద్రించాలని సూచిస్తున్నారు. తల, పాదాలను మసాజ్ చేసుకోవడం ద్వారా నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుందని అంటున్నారు. పడుకుముందే గోరువెచ్చని పాలలో తేనె లేదా పసుపు కలుపుకుని తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాక, పడుకునే ముందు ఫోన్లు, టీవీలను చూడకుండా, వాటికి దూరంగా ఉంటే మంచి నిద్రకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.