
ఉలవలు మన సంప్రదాయ ఆహారంలో విశేషమైన స్థానం కలిగినవి. ఇవి పోషక విలువలతో నిండివున్న పప్పుదినుసుల్లో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్, పీచు పదార్థాలు, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఇవి శరీరానికి ఆహారంగా మారి అనేక లాభాలు చేకూరుస్తాయి. చలికాలంలో ఉలవలను ఆహారంలో చేర్చడం వల్ల తక్షణ శక్తి అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఉలవలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్తితో బాధపడేవారు రోజూ ఉలవలను తింటే జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పీచు పదార్థాలు శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను దూరం చేస్తాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉలవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉలవలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే గుణాలు ఉన్నాయి. ఈ గుణాల కారణంగా డయాబెటిస్ ఉన్నవారు వాటిని డైట్‌లో చేర్చుకోవచ్చు. అయితే మోతాదులో తీసుకోవడం, అలాగే డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
రక్తహీనత సమస్యలను తగ్గించడంలో ఉలవలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్త హీనత బాధ పడేవారు వీటిని తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. అంతేకాదు, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కూడా ఉలవలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉలవల్లో అధికంగా ఉండే ప్రోటీన్, పీచు పదార్థాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. గుగ్గిల్లు, ఉలవచారు, స్నాక్స్ రూపంలో ఉలవలను ఆహారంలో చేర్చడం ద్వారా బరువును సులభంగా నియంత్రించవచ్చు. ఉలవలును కషాయం రూపంలో తాగితే బరువు తగ్గడంలో మరింత సహాయం అందుతుంది.
చర్మ ఆరోగ్యానికి, జుట్టు పోషణకు ఉలవలు దోహదం చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉండటంతో చర్మ సమస్యలను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు చర్మానికి అవసరమైన పోషణను అందించి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీనితో పాటు రోజంతా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)